![Snake Entry in RTC Bus YSR Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/30/snake.jpg.webp?itok=LkOWA6P1)
బస్సులోని పామును పట్టుకున్న దృశ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : బస్సులో పాము దూరి ప్రయాణికులందరినీ వణికించింది. ముచ్చెమటలు పట్టించింది. మంగళవారం కడపలో ఈ సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్ వేడికి తాళలేక వినాయక నగర్ సర్కిల్‌లోకి రాగానే అది కాస్తా కొంచెం పైకి వచ్చేసింది. వెంటనే డ్రైవరు గమనించాడు. బస్సును ఆపేశాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. అందరిలో ఒకటే టెన్షన్.
ఎటుగా వచ్చిఏం చేస్తుందోనని టెన్షను..డ్రైవరు చాకచక్యంగా ప్రయాణికులందరినీ దింపేశాడు. ప్రయాణికులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కేకలు వేశారు. అక్కడికి సమీపంలో పాములు పట్టే వ్యక్తి ఉన్నారని అందులో ఒకరు చెప్పారు. వెంటనే అతనికి ఫోన్‌లో విషయం చెప్పారు. ఆగమేఘాలపై పాములు పట్టుకునే వ్యక్తి బస్సు వద్దకు చేరుకున్నారు. తనదైన నేర్పరితనంతో ఒక మూల నక్కి ఉన్న పామును పట్టుకోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును దూరంగా విడిచిపెట్టారు. తర్వాత బస్సు కదిలింది.
Comments
Please login to add a commentAdd a comment