కల్వర్టును ఢీ కొనడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయిన దృశ్యం, క్షతగాత్రులను కిందికి దించుతున్న స్థానికులు
బద్వేలు అర్బన్/బి.మఠం : బద్వేలు–మైదుకూరు రహదారిలోని వాంపల్లెచెరువు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొన్న ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ టీఎస్ రాయుడు (ఇ405030) నిర్లక్ష్యం, అతివేగంగా నడపడమేనని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మైదుకూరు డిపోకు చెందిన ఏపీ 29 జెడ్0682 నంబరు గల ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు 27 మంది ప్రయాణికులతో బద్వేలుకు బయల్దేరింది. వాంపల్లెచెరువు సమీపంలోకి రాగానే బస్సు రోడ్డుకు ఓ వైపు ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొంది. దీంతో వెనుక టైరు వరకు కల్వర్టు గోడపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ పీవీ సుబ్బయ్య (ఇ400577)తో పాటు బస్సులోని 16 మందికి గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను డ్రైవర్ ద్వారం నుంచి కిందికి దించారు. 108 సాయంతో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు.
గాయపడిన వారి వివరాలు: బద్వేలు–మైదుకూరు రహదారిలోని వాంపల్లెచెరువు వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ఎక్కువ మంది బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన వారు గాయపడ్డారు. వీరంతా ఖాజీపేటలో జరిగే ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. సుందరయ్యకాలనీకి చెందిన రమణయ్య, మైదుకూరులోని సాయినాథపురానికి చెందిన సుబ్బయ్య, పోరుమామిళ్లలోని సిద్దవరానికి చెందిన బాలయ్య, బీ మఠం మండలం టీ రామాపురానికి చెందిన సుజాత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కడప రిమ్స్‌కు తరలించారు. బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన బాలమ్మ, ఖాజాబీ, షమీనా, ఫాతిమా, ఖైరున్‌బీ, రసూల్‌బీ, ముస్తఫాతో పాటు పట్టణంలోని బసవ వీధికి చెందిన వేణుగోపాల్, నాగ రాఘవాచారి, మంగళ కాలనీకి చెందిన రఫితో పాటు రామాపురానికి చెందిన మధు, సిద్దవరానికి చెందిన సాలమ్మకు గాయాలయ్యాయి. బీ మఠం ఎస్‌ఐ రాజగోపాల్‌తో పాటు అర్బన్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల వివరాలను, ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బీ మఠం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment