టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు! | Hyderabad City Women Shows Interest In Bike and Car Driving  | Sakshi
Sakshi News home page

టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు!

Published Mon, Mar 1 2021 3:50 PM | Last Updated on Mon, Mar 1 2021 4:08 PM

Hyderabad City Women Shows Interest In Bike and Car Driving  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మహిళలు టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నారు. డ్రైవింగ్‌లో సత్తా చాటుతున్నారు. అభిరుచి కోసం.. అవసరాల కోసం వాహనాలను నడుపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. డ్రైవర్లపై ఆధారపడకుండా సొంత వాహనాలను వినియోగించేందుకే ఆసక్తి చూపుతున్నారు. మగువల అభిరుచికి తగ్గట్లు పలు మోడళ్లలో బైక్‌లు, కార్లు వచ్చేస్తున్నాయి. గేర్‌లెస్‌ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

రవాణా శాఖ గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో 1,26,340 మంది మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 33 వేల మంది డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకున్నారు. వీరిలో 65 శాతం ఫోర్‌ వీలర్‌ లైసెన్సులు కాగా, 35 శాతం వరకు టూ వీలర్‌ లైసెన్సులు ఉన్నాయి. చాలా మంది రెండు రకాల లైసెన్సులు తీసుకోవడం గమనార్హం.


అభిరుచి.. అవసరం!
ఇంట్లో నాలుగు కార్లు, 24 గంటల పాటు అందుబాటులో డ్రైవర్లు ఉన్నా.. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి కారు డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆమె శిక్షణ పొందారు. ఉదయాన్నే జిమ్‌కు వెళ్లడం.. సాయంత్రం షాపింగ్‌కు వెళ్లడం.. పిల్లలను బయటకు తీసుకెళ్లడం.. ఇలాంటి పనులకు డ్రైవర్లపై ఆధారపడాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ ప్రయాణాన్ని, అవసరాలను వ్యక్తిగతంగా భావించే చాలామంది మహిళలు ఇలా సొంత వాహనాలనే ఇష్టపడుతున్నారు.


సురక్షిత ప్రయాణం..
కోవిడ్‌ కారణంగా ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. కానీ, సాధారణంగా అయితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువ శాతం సొంత వాహనాలనే వాడుతారు. సాఫ్ట్‌వేర్‌ మహిళలకు సొంత కార్లు తప్పనిసరి అవసరంగా మారాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లేందుకు, తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునేందుకు ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. 2018లో 42 వేల మందికి పైగా మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకున్నారు. పైగా కోవిడ్‌ నేపథ్యంలో చాలామంది సొంత వాహనాలకే మొగ్గు చూపు తున్నారు. డ్రైవింగ్‌ను అభిరుచి కోసమే కాకుండా షీ క్యాబ్స్‌ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలు కూడా ఉన్నారు.

సౌకర్యంగా ఉంటుంది
సొంత వాహనాల్లో ఇంటిల్లిపాది కలసి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్లట్లేదు. నేనే స్వయంగా వాహనం నడపడం నేర్చుకొన్నాను.
– శ్రీలక్ష్మి, గృహిణి

ఉపాధి కోసం నేర్చుకున్నా..
షీ క్యాబ్‌ ద్వారా ఉపాధి పొందాలనే ఆలోచనతో ఇటీవలే డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వ సహకారంతో బ్యాంకు రుణంతో కారు కొనుక్కొన్నాం. 
– కోలా కరోలిన్‌

కోవిడ్‌ తర్వాత డిమాండ్‌ పెరిగింది
కోవిడ్‌ తర్వాత ప్రజా రవాణా వినియోగం తగ్గడంతో సొంత వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. ఇదే సమయంలో శిక్షణకు వచ్చే మహిళలు కూడా పెరిగారు. ఇటీవల గృహిణులు ఎక్కువ సంఖ్యలో శిక్షణ తీసుకున్నారు.
– సామ శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డి మోటార్‌ డ్రైవింగ్‌ స్కూల్, బంజారాహిల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement