జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్‌సీన్‌లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు.
కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment