యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో సౌదీ రాజు సల్మాన్ సమాలోచన(ఫైల్ ఫొటో)
సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుమారుడు, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దుస్సాహసానికి పూనుకున్నారు. ఏకకాలంలో ఇంటా, బయటా సమస్యలు సృష్టిస్తూ నిప్పుతో చెలగాటమాడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ అవినీతి ఆరోపణల సాకుతో బంధించారు. రాజకుటుంబంతోనే సంబంధాలున్న మరికొందరు మాజీ మంత్రులను, వ్యాపారులను కూడా అరెస్టు చేశారు.
ఇద్దరు యువరాజులు అను మానాస్పద స్థితిలో మరణించారు. వీరిలో ఒకరిని దుండగులు కాల్చిచంపారు. మరొకరు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదంతా గమని స్తున్న మరో యువరాజు బతుకు జీవుడా అనుకుంటూ తన ప్రైవేటు విమానంలో ప్రత్యర్థి దేశమైన ఇరాన్‌కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. ఒకపక్క దేశంలో ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న యువరాజు సల్మాన్ పొరుగునున్న యెమెన్‌లో బాంబుల మోత మోగిస్తున్నాడు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో మంగళవారం 50మంది మరణించారు. రియాద్ విమానాశ్రయం లక్ష్యంగా క్షిపణి దాడి జరగడంతో సౌదీ రెచ్చిపోయింది. దాదాపు రెండేళ్లనుంచి యెమెన్‌లో తిరుగుబాటుదార్లపై సౌదీ సంకీర్ణ దళాలు దాడులు చేస్తున్నా ఫలితం దక్కకపోగా 10,000మంది పౌరులు మరణించారు. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి పౌరులకు నిత్యావసర సరుకులు, ఔషధాలు అందకుండా సంకీర్ణ సేనలు అడ్డుకుంటున్నాయి. యెమెన్ తిరుగుబాటుదార్లకు ఇరాన్ మద్దతునిస్తున్నదని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది.
ఈ పరిణామాలు చాలవన్నట్టు సౌదీ పర్యటనకొచ్చిన లెబనాన్ ప్రధాని సాద్ హరిరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కడినుంచే ప్రకటించారు. రాజీనామా వెనక సౌదీ హస్తమున్నదని, తమ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడమే ఆ చర్య ఉద్దేశమని లెబనాన్ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. లెబనాన్‌లో ఏడాది నుంచి ఎంతో విజయవంతంగా సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వానికి హరిరి నేతృత్వంవహిస్తున్నారు. హరిరి ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీకి సౌదీ అండదండలున్నాయి. అయితే ఆ ప్రభుత్వంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాతోసహా పలు పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
సౌదీ అరేబియాలోని అంతర్గత పరిణామాలనూ, ఇరుగుపొరుగుతో దాని ఘర్ష ణలనూ వేర్వేరుగా చూడలేం. అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు. ఉన్నది దాయాది కుటుంబస్వామ్యమే. అయితే పాలనలో పాలుపంచుకుంటున్న కుటుం బసభ్యుల మధ్య సమన్వయాన్ని సాధించి, వారికి మత నాయకులను కూడా జోడించి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని రూపొందించారు. కొన్ని దశాబ్దాలుగా అదే సాగుతోంది. ఇరాన్‌తో ఘర్షణలు తలెత్తకుండా, పశ్చి మాసియాలో అశాంతి చెలరేగకుండా ఇది తోడ్పడింది. కానీ 2015లో అధికారాన్ని చేజిక్కించుకున్న రాజు సల్మాన్ అబ్దుల్ అజీజ్ దీన్నంతటినీ తారుమారు చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. తన కుమారుడు యువరాజు సల్మాన్‌ను ఆర్నెల్లక్రితం వారసుడిగా ప్రకటించి అప్పటికే అతని దగ్గరున్న రక్షణ శాఖకు తోడు ఆర్ధిక శాఖ కూడా కట్టబెట్టారు. ఆంతరంగిక భద్రతా వ్యవహారాలను చూస్తున్న సీనియర్ ఉప ప్రధాని మహమ్మద్ బిన్ నయీఫ్ అల్ సౌద్‌ను తప్పించారు. ఆయన ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నాడంటున్నారు. ఖతర్‌తో గత జూన్‌లో తెగదెంపులు చేసు కోవడాన్ని నయీఫ్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఆయనకు ఉద్వాసన పలికినట్టు అప్పట్లోనే కథనాలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో ఇరాన్ కాక తామే తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది రాజు అజీజ్, యువరాజ్ సల్మాన్‌ల స్వప్నం. అయితే ఇరాన్‌తో కయ్యానికి దిగితే ఫలితం దక్కకపోగా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాజ కుటుంబంలోని ఇతరులు హెచ్చరిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధనతోనే ముందడు గేయాల్సి ఉండటంతో అజీజ్, సల్మాన్‌లకు ఎటూ పాలుబోవడం లేదు. అందుకే అవినీతి ఆరోపణల సాకుతో అందరినీ అరెస్టు చేశారు. ఈ పరిణామాల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడం కోసం దేశంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు, మహి ళలకు కొన్ని హక్కులు కల్పిస్తున్నట్టు చూపుతున్నారు.
అజీజ్, సల్మాన్‌ల ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. జిహాదీలను ఉపయోగించి సిరి యాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను పదవీభ్రష్టుణ్ణి చేయాలని చూస్తే ఆయన కాస్తా మరింత బలపడ్డారు. యెమెన్‌ను లొంగదీసుకోవాలనుకుంటే అది తారు మారైంది. ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న హౌతీ తిరుగుబాటుదార్లు కొరకరాని కొయ్యలుగా మారారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక సౌదీ రాజ కుటుంబంలో పొరపొచ్చాలు మరింత పెరిగాయి. అరెస్టయిన యువ రాజుల్లో ఒకడైన తలాల్ అల్ వలీద్ ఒకప్పుడు డోనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు. 1,700 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ట్రంప్ వ్యాపారాలకు ఆర్ధికంగా సాయపడిన తలాల్... ఆయన అధ్యక్ష పదవికి పోటీపడటాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. సౌదీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఖండించాడు. అందుకే ట్రంప్ వెనకుండి ఈ అవినీతి వ్యతిరేకపోరాటాన్ని మొదలెట్టించారు. ఈ పరిణామాలన్నిటి వెనకున్న ఆంతర్యం తేటతెల్లమే. ఇరాన్‌ను చక్రబంధంలో బిగించి ఇజ్రాయెల్ సాయంతో పశ్చిమాసియాలో సౌదీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం... దాని ద్వారా తాను లాభపడటం అమెరికా ఉద్దేశం. అయితే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ సీనియర్ అధికారి చెప్పినట్టు ఇరాన్‌ను లొంగదీసుకోవడం అసాధ్యం. భద్ర తామండలి ద్వారా అమెరికా దశాబ్దాలుగా అమలు చేయించిన ఆర్ధిక ఆంక్షలను తట్టుకుని అది నిలబడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అది తిరుగులేని ఆర్ధిక శక్తి. దాని జోలికెళ్తే సౌదీ మాత్రమే కాదు... అమెరికా, ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. పశ్చిమాసియా తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ప్రపంచ దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ ప్రమాదకర పోకడలకు అమెరికా స్వస్తి పలకాలి. ఆ ప్రాంత దేశాలు కలిసికట్టుగా వాటి భవితవ్యాన్ని రూపొందించుకునే అవకాశా న్నివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment