మేనల్లుడిని పీకేసి.. కొడుకుకు పట్టం!
- సౌదీ రాజు సల్మాన్ అనూహ్య నిర్ణయం
రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు మహమ్మద్ బిన్ నయెఫ్ (57)ను అకస్మాత్తుగా యువరాజు పదవి నుంచి తొలగించి.. ఆ పదవిలో తన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రతిష్టించారు. సంప్రదాయ ఇస్లామిక్ రాజ్యమైన సౌదీలో యువ వారసులకు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ఈ నియామకంతో నయెఫ్‌ను అధికారాలన్నీ తొలగించినట్టు అయింది. అదేవిధంగా 31 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్‌కు డిప్యూటీ ప్రధానమంత్రి పదవిని కూడా కేటాయిస్తున్నట్టు రాజు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహమ్మద్ బిన్ సల్మాన్ వద్ద ఉన్న రక్షణమంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని వెల్లడించారు.
81 ఏళ్ల సల్మాన్ సౌదీ రాజుగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అంతర్గతంగా అధికారం కోసం కుటుంబవర్గపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని పక్కనబెట్టి.. తన కొడుకుకు పట్టాభిషిక్త యువరాజుగా సల్మాన్ అధికారికంగా పట్టం గట్టడం గమనార్హం. తద్వారా తన తర్వాత రాజు పదవిని చేపట్టేందుకు తన కొడుకుకు మార్గం సుగమం చేశారు.