ప్రతీకాత్మక చిత్రం
రియాద్ : సౌదీ అరేబియా భద్రతా సంస్థ(ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ) విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఫెమినిజం, స్వలింగసంపర్కం, ఎథిజం(నాస్తికత్వం) అనేవి తీవ్ర వాద భావాలంటూ భద్రతా సంస్థ పేర్కొనడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి తీవ్రవాద భావాలు, వంకర బుద్ధి ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. మాతృదేశ విధానాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అది తీవ్రవాదంగానే పరిగణింపబడుతుంది అనే వాయిస్ ఓవర్‌తో సాగిన వీడియోలో ఫెమినిజం, స్వలింగ సంపర్కం, ఎథిజాన్ని తీవ్రవాద భావనలుగా అభివర్ణించింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నవయుగ సౌదీ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని చెబుతూనే ఇలాంటి వీడియోలు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సౌదీ రాచరికం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించడం, అదే విధంగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చంటూ సరికొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసే ఎడారి దేశం.. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందనే వాదనలు వినిపించాయి. ఇక తాజా వీడియోతో మరోసారి మహిళలు, నాస్తికుల పట్ల సౌదీ నిజమైన వైఖరేంటో అర్థమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment