journalist murder case
-
సౌదీ పౌరుల వీసా బ్యాన్ చేసిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా పౌరుడైన జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలను మాత్రమే విధించించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్యలతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలో తాజా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు. ఇక 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని అన్నారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టు జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం నివేదికను విడుదల చేస్తూ.. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు పిలిపించి ముక్కలుముక్కలుగా నరికి చంపినట్లు అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని ఆమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆ దారుణంపై అమెరికా ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఖషోగ్గిని బంధించండి లేదా హత్య చేయాలంటూ ప్రిన్స్ సల్మాన్ ఆదేశించినట్లు ఆ నివేదికలో తెలిపింది. ప్రిన్స్ అనుమతి లేకుండా.. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద దారుణం చోటు చేసుకోవడం అసంభవం అని నివేదికలో పేర్కొన్నది. అయితే అమెరికా నేరుగా సౌదీ రాజుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నివేదికను వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సౌదీపై డజన్ల సంఖ్యలో ఆంక్షలను ప్రకటించింది. అయితే అమెరికా రిలీజ్ చేసిన నివేదికను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగటివ్, తప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్నది. జర్నలిస్టు ఖషోగ్గి మర్డర్ కేసులో తన పాత్రలేదని సౌదీ రాజు మహ్మద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ క్రమంలో ఖషోగ్గి మర్డర్ ఆపరేషన్‌కు ప్రిన్స్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రుజువు చేసేందుకు మూడు కారణాలను అమెరికా నివేదిక పేర్కొన్నది. చదవండి: సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం? ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’
ఇస్తాంబుల్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపడమే కాక సౌదీ అరేబియా పాలకుడి ప్రతిష్టను దెబ్బ తీసిన ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసును టర్కీ కోర్టు శుక్రవారం విచారించింది. ఈ నేపథ్యంలో సౌదీ కాన్సులేట్ వర్కర్ ఒకరు సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో 20మంది సౌదీ అధికారులు గైర్హాజరు కావడంతో.. టెక్నికల్ నిపుణుడు జెకి డెమిర్ సాక్ష్యం కీలకంగా మారింది. ‘ఖషోగ్గి తన పత్రాల కోసం కాన్సులేట్‌కి వచ్చాడు. అప్పుడు అక్కడ ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. ఖషోగ్గి అక్కడికి వచ్చిన కాసేపటికి వారు నన్ను పిలిచి ఒక ఓవేన్‌ని వెలిగించమని చెప్పారు. వారంతా భయాందోళనలకు గురవుతున్నట్లు కనిపించారు. ఆ తర్వాత కాన్సులేట్ గార్డెన్లో ఓవేన్‌ని పడేశారు. దాని చుట్టూ చిన్న చిన్న మాంసం ముక్కలు ఉన్నాయి.. ఆ తర్వాత ఓవెన్ చుట్టు ఉన్న పాలరాయిని రసాయనాలతో శుభ్రం చేశారనుకుంటా. అందువల్ల అది రంగు మారినట్లు కనిపించింది’ అని డెమిర్ కోర్టుకు తెలిపాడు. స్థానిక రెస్టారెంట్ నుండి ముడి కబాబ్‌లను తీసుకురావాలని తనను కాన్సుల్ ఆదేశించినట్లు కాన్సుల్ డ్రైవర్ అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. (ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఖషోగ్గిని ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత హంతకులు అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చి వేయాలని భావించినట్లు టర్కీ పోలీసులు ఆరోపించారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండ పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) ఈ కేసులో ఇద్దరు సౌదీ ఉన్నతాధికారులు మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరి, మాజీ రాయల్ కోర్ట్ సలహాదారు సౌద్ అల్-కహ్తాని మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు ముందస్తు పథకం ప్రకారమే ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రియాద్ కోర్టు వీటిని తోసి పుచ్చింది. అంతేకాక తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా అసిరిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు అయిదుగురికి మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ అల్ షలాన్ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్ 2న ఇస్తాంబుల్ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు. -
సౌమ్య హత్యకేసు; లాయర్లపై కేజ్రీవాల్ ఆగ్రహం!
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం హత్యకు గురైన జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ‘ ఈ కేసును వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గనుక సరైన రీతిలో స్పందించనట్లైతే వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తాం. వారి తీరు నిజంగా నన్ను విస్మయపరిచింది. అదే విధంగా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ సెప్టెంబరు 30, 2008లో తన కారులోనే దారుణ హత్యకు గురయ్యారు. విధులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు.. వసంత్ కుంజ్ వద్ద ఆమెను కాల్చి చంపారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను 2009లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. పదేళ్లుగా విచారణ కొనసాగుతున్నా తన కూతురి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సౌమ్య తండ్రి ఎంకే విశ్వనాథన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విచారణకు హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో సౌమ్య హత్య కేసును వాదిస్తున్న లాయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. -
డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
పంచ్‌కుల: జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతి హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబా, మరో ముగ్గురికి జీవిత కారాగారం విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. బాబా, అతని అనుయాయులు నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్, కృష్ణలాల్ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతిని చంపేశారు. డేరా బాబా ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ చత్రపతి తన పత్రికలో కథనం ప్రచురించడమే ఇందుకు కారణం. -
జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ (డేరాబాబా)కు జర్నలిస్ట్ హత్య కేసులో హర్యానాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జీవిత ఖైదు విధించింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరాబాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. కాగా పూరాసచ్ పేరుతో రాంచందర్ చత్తర్‌పతి నిర్వహించే వార్తాపత్రికలో డేరా బాబా ఆశ్రమంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు వార్తలు ప్రచురితమయ్యేవి. డేరా బాబా నిర్వాకాలపై కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో రాంచందర్ చత్తర్పతిని 2002 అక్టోబర్ 24న ఆయన ఇంట్లోనే కాల్చిచంపారు. ఈ హత్య కేసులో 2003లో డేరా బాబాపై కేసు నమోదు చేయగా, 2006లో కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. 2007లో కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. జర్నలిస్ట్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోషిగా నిర్ధారిస్తూ గురువారం హర్యానాలోని పంచ్‌కుల సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్‌లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించింది. -
డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!) ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా) -
లష్కరే కమాండర్ నవీద్ జఠ్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో భద్రతా సిబ్బంది, పౌరులపై పలు అమానుష దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా కమాండర్ నవీద్ జఠ్ (22) హతమయ్యాడు. కశ్మీరీ సీనియర్ పాత్రికేయుడు షుజాత్ బుఖారీ హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కశ్మీర్ బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో జఠ్తో పాటు అతని సహచరుడుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. గతంలో జఠ్ ఆరు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతడు పోలీసు కస్టడీ నుంచే నాటకీయ పరిణామాల నడుమ పారిపోవడం సంచలనం సృష్టించింది. జఠ్ పాకిస్తానీయుడని, విధానపర లాంఛనాల ప్రకారం అతని మృతదేహాన్ని పాకిస్తాన్‌కు అప్పగిస్తామని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిందిలా.. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో బుద్గాంలోని కుత్పోరా చాతర్ గామ్ అనే ప్రాంతంలో బుధవారం వేకువ జామునే భద్రతా సిబ్బంది తనిఖీల్ని ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. సూర్యోదయం అయ్యాక ఇద్దరు మిలిటెం ట్లను భద్రతా సిబ్బంది అంతమొందించారు. మృతుల్లో ఒకరిని నిషేధిత ఎల్ఈటీ కమాండర్ నవీద్ జఠ్గా గుర్తించారు. కసబ్‌కు సహాధ్యాయి.. పాక్‌లోని ముల్తాన్‌లో జన్మించిన నవీద్ జఠ్.. 26/11 ముంబై దాడిలో సజీవంగా చిక్కిన అజ్మల్ కసబ్‌కు మదరసాలో సహాధ్యాయి. వీరిద్దరు అక్కడే ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సముద్ర మార్గంలో వినియోగించే దిక్సూచి కంపాస్, జీపీఎస్, వైర్లెస్ సెట్లు, స్కైప్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేయడంలో జఠ్ నైపుణ్యం సంపాదించాడు. 2012, అక్టోబర్‌లో జఠ్ తన సహచరులతో కలసి కశ్మీర్ లోయలోకి చొరబడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. లోయలో ఎన్నో ఉగ్రదాడులు, బ్యాంకు దొంగతనాల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు. -
ఆ జర్నలిస్ట్ హత్యకు ఎవరు బాధ్యులు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జర్నలిస్ట్ సందీప్ శర్మ (35) హత్య లేదా యాక్సిడెంట్ మృతిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తన ప్రాణాలతోపాటు తన స్టింగ్ ఆపరేషన్‌లో తనకు సహకరించిన సహచరుడు వికాస్ పురోహిత్ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ సందీప్ శర్మ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. తగిన రక్షణ కల్పించలేదు. ఫలితంగా భిండ్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సందీప్ శర్మను ట్రక్కు రూపంలో వచ్చిన మత్యువు కబళించుకుపోయింది. ‘సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఇంద్ర వీర్ సింగ్ భడౌరియా బలమైన మనిషి, ఆయనకు స్థానిక నేరస్థులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించవచ్చు. లేదా హత్య చేసి యాక్సిడెంట్‌గా చూపించవచ్చు. నాకు స్టింగ్ ఆపరేషన్‌లో సహకరించిన వికాస్ పురోహిత్‌కు తగిన రక్షణ కల్పించండి’ అంటూ సందీప్ శర్మ సీనియర్ పోలీసు అధికారులకు లేఖలు రాశారు. అందులో ఓ లేఖను భిండ్ పోలీస్ సూపరిండెండెంట్ కార్యాలయం నవంబర్ 3వ తేదీన అందుకుంది. దానిపై తేదీ ముద్ర కూడా ఉంది. ఆ లేఖలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖా ప్రతులు పంపుతున్నట్టు పేర్కొని ఉంది. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన ఆయనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ స్థానిక జర్నలిస్టులు ఎస్పీకి విడిగా లేఖలు రాశారు. సందీప్‌పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని కూడా వారు వాటిలో కోరారు. నేషనల్ ఛంబల్ సాంక్చరీ నుంచి అక్రమంగా ఇసుక రవాణాను అనుమతించేందుకు ఇంద్రవీర్ సింగ్ తన నివాసంలో ఇసుక మాఫియా నుంచి 12.500 రూపాయలు తీసుకుంటుండగా సందీప్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డు చేశారు. ఆ వీడియో గతేడాది ‘న్యూస్ వరల్డ్’ ఛానల్లో అక్టోబర్ నెలలో ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. వీడియో ప్రసారానికి ముందే, ప్రసారాన్ని అడ్డుకునేందుకు ఓ కవర్లో కొంత డబ్బు పెట్టి పోలీసు అధికారి ఇంద్రవీర్ సింగ్, సందీప్‌కు పంపించారని, దాన్ని ఆయన తిరస్కరించారని, ఈ రోజున ఇంత ఘోరం జరిగిపోయిందని పురోహిత్ మంగళవారం భిండ్ ప్రెస్‌క్లబ్ వద్ద వ్యాఖ్యానించారు. సందీప్ హత్యను స్థానిక పోలీసులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగానే నమోదు చేశారు. ఈ కేసులో ట్రక్కును నడిపిన రణవీర్ యాదవ్ అనే లారీ క్లీనర్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎడమ వైపు తన లారీని మలుపు తిప్పగానే ఎదురుగా ఓ మహిళా అడ్డుగా వచ్చిందని, ఆ మహిళను తప్పించబోయి ట్రక్కును మరింత ఎడమకు తిప్పగా ఎడమ నుంచే వస్తున్న సందీప్ బైక్‌కు తగిలి ఉంటుందని రణవీర్ యాదవ్ వివరించారు. సందీప్ బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని కూడా తాను గుర్తించలేనని చెప్పారు. క్లీనర్‌గా ఉన్న వ్యక్తి ట్రక్కును ఎందుకు నడపాల్సి వచ్చిందంటే నడపడంలో తనకు అనుభవం ఉంది కనుక నడిపానని తెలిపారు. టీవీలు ప్రసారం చేసిన యాక్సిడెంట్ ఫుటేజ్ కూడా అనుమానాస్పదంగానే ఉంది. సందీప్ ఎలా మరణించారన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన, తోటి జర్నలిస్టులు ఉన్నతాధికారులకు అన్ని లేఖలు రాసినా వారు ఎందుకు స్పందించలేదన్నది సమాధానం లేని ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కచ్చితంగా సమాధానం కావాలంటూ సందీప్ నివాళి ర్యాలీలో తోటి జర్నలిస్టులు డిమాండ్ చేశారు. -
లాలూ కుమారుడికి ఊరట
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బిహార్‌లో సంచలనం సృష్టించిన జర్నలిస్టు హత్యకు సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్, మహ్మద్ కైఫ్, మహ్మద్ జావేద్‌లకు సంబంధించి.. పత్రికల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల నుంచి ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అన్న కోణంలో విచారించారా అని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన ఆధారాలు సంపాదించలేకపోయామని సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు తేజ్‌ప్రతాప్ రావాల్సిన అవసరంలేదని గురువారం స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మహ్మద్ కైఫ్, మహ్మద్ జావేద్ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది... బిహార్ ప్రాంతీయ దినపత్రికకు చెందిన రాజ్దేవ్ రాజన్ సివాన్ పట్టణంలో 2016,మే 13న హత్యకు గురయ్యారు. జైలు పాలైన ఆర్జేడీ నేతకు చెందిన గన్మెన్లు ఈ హత్య చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాజ్దేవ్ భార్య కూడా తేజ్‌ప్రతాప్‌ను విచారించాలని కోరడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. బిహార్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన చంద్రకేశ్వర్ ప్రసాద్ కుమారుల హత్యకేసుకు సంబంధించి రాజ్దేవ్ వార్తలు రాశారు. ఈ విషయమై తేజ్‌ప్రతాప్.. రాజ్‌దేవ్‌ను బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజ్దేవ్ హత్య కేసులో ఆర్జేడీ నేత, గ్యాంగ్‌స్టర్ షహబుద్దీన్ కీలక సూత్రధారి అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినా ఎఫ్ఐఆర్లో ఆయన పేరును పోలీసులు చేర్చలేదు. షహబుద్దీన్‌కు మరో కేసులో కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది. -
జర్నలిస్టు హత్యకేసులో మంత్రి అనుచరుడి అరెస్టు
-
జర్నలిస్టు హత్యకేసులో మంత్రి అనుచరుడి అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జర్నలిస్టు శంకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఏపీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన అనుచరుడు వెంగళ్రాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారమే అతడిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. చిలకలూరిపేట ఆంధ్రప్రభ విలేకరి శంకర్ హత్యకేసులో వెంగళ్రాయుడు ప్రధాన నిందితుడు, ఈ హత్యకు అతడే సూత్రధారి అని ఆరోపణలున్నాయి. వెంగళ్రాయుడు పోలీసు స్టేషన్లోనే పంచాయతీలు చేయడంపై శంకర్ పలు కథనాలు రాయడంతోనే అతడిని హత్యచేశారు. సుమారు మూడు నెలల క్రితం శంకర్ తన పత్రికా కార్యాలయం నుంచి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కాపుకాసి అతడిని హత్యచేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వెంగళ్రాయుడు మాత్రం మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎన్నికలకు ముందు నుంచి కూడా అతడే పుల్లారావు ఎన్నికల వ్యవహారాలను చూస్తుండటంతో పోలీసులు ఇన్నాళ్లుగా చూసీ చూడనట్లు వదిలేశారు. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం జరగడంతో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టుచేయక తప్పలేదు. పోలీసుల ప్రత్యేక బృందం అతడిని అరెస్టుచేసి చిలకలూరిపేట స్టేషన్‌కు తీసుకొచ్చారు. గత కొంత కాలంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా రాసినా, వెంగళ్రాయుడిపై వార్తలు రాసినా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జర్నలిస్టునే హతమార్చారు.