సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ (డేరాబాబా)కు జర్నలిస్ట్ హత్య కేసులో హర్యానాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జీవిత ఖైదు విధించింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరాబాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. కాగా పూరాసచ్ పేరుతో రాంచందర్ చత్తర్‌పతి నిర్వహించే వార్తాపత్రికలో డేరా బాబా ఆశ్రమంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు వార్తలు ప్రచురితమయ్యేవి.
డేరా బాబా నిర్వాకాలపై కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో రాంచందర్ చత్తర్‌పతిని 2002 అక్టోబర్ 24న ఆయన ఇంట్లోనే కాల్చిచంపారు. ఈ హత్య కేసులో 2003లో డేరా బాబాపై కేసు నమోదు చేయగా, 2006లో కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. 2007లో కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. జర్నలిస్ట్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోషిగా నిర్ధారిస్తూ గురువారం హర్యానాలోని పంచ్‌కుల సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్‌లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment