![Arvind Kejriwal Orders Special Prosecutor In Journalist Murder Case - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/8/delhi.jpg.webp?itok=cchWlYWR)
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం హత్యకు గురైన జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ‘ ఈ కేసును వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గనుక సరైన రీతిలో స్పందించనట్లైతే వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తాం. వారి తీరు నిజంగా నన్ను విస్మయపరిచింది. అదే విధంగా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
కాగా టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ సెప్టెంబరు 30, 2008లో తన కారులోనే దారుణ హత్యకు గురయ్యారు. విధులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు.. వసంత్ కుంజ్ వద్ద ఆమెను కాల్చి చంపారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను 2009లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. పదేళ్లుగా విచారణ కొనసాగుతున్నా తన కూతురి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సౌమ్య తండ్రి ఎంకే విశ్వనాథన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విచారణకు హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో సౌమ్య హత్య కేసును వాదిస్తున్న లాయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment