సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జర్నలిస్ట్ సందీప్ శర్మ (35) హత్య లేదా యాక్సిడెంట్ మృతిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తన ప్రాణాలతోపాటు తన స్టింగ్ ఆపరేషన్‌లో తనకు సహకరించిన సహచరుడు వికాస్ పురోహిత్ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ సందీప్ శర్మ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. తగిన రక్షణ కల్పించలేదు. ఫలితంగా భిండ్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సందీప్ శర్మను ట్రక్కు రూపంలో వచ్చిన మత్యువు కబళించుకుపోయింది.
‘సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఇంద్ర వీర్ సింగ్ భడౌరియా బలమైన మనిషి, ఆయనకు స్థానిక నేరస్థులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించవచ్చు. లేదా హత్య చేసి యాక్సిడెంట్‌గా చూపించవచ్చు. నాకు స్టింగ్ ఆపరేషన్‌లో సహకరించిన వికాస్ పురోహిత్‌కు తగిన రక్షణ కల్పించండి’ అంటూ సందీప్ శర్మ సీనియర్ పోలీసు అధికారులకు లేఖలు రాశారు. అందులో ఓ లేఖను భిండ్ పోలీస్ సూపరిండెండెంట్ కార్యాలయం నవంబర్ 3వ తేదీన అందుకుంది. దానిపై తేదీ ముద్ర కూడా ఉంది. ఆ లేఖలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖా ప్రతులు పంపుతున్నట్టు పేర్కొని ఉంది. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన ఆయనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ స్థానిక జర్నలిస్టులు ఎస్పీకి విడిగా లేఖలు రాశారు. సందీప్‌పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని కూడా వారు వాటిలో కోరారు.
నేషనల్ ఛంబల్ సాంక్చరీ నుంచి అక్రమంగా ఇసుక రవాణాను అనుమతించేందుకు ఇంద్రవీర్ సింగ్ తన నివాసంలో ఇసుక మాఫియా నుంచి 12.500 రూపాయలు తీసుకుంటుండగా సందీప్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డు చేశారు. ఆ వీడియో గతేడాది ‘న్యూస్ వరల్డ్’ ఛానల్‌లో అక్టోబర్ నెలలో ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. వీడియో ప్రసారానికి ముందే, ప్రసారాన్ని అడ్డుకునేందుకు ఓ కవర్‌లో కొంత డబ్బు పెట్టి పోలీసు అధికారి ఇంద్రవీర్ సింగ్, సందీప్‌కు పంపించారని, దాన్ని ఆయన తిరస్కరించారని, ఈ రోజున ఇంత ఘోరం జరిగిపోయిందని పురోహిత్ మంగళవారం భిండ్ ప్రెస్‌క్లబ్ వద్ద వ్యాఖ్యానించారు.
సందీప్ హత్యను స్థానిక పోలీసులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగానే నమోదు చేశారు. ఈ కేసులో ట్రక్కును నడిపిన రణవీర్ యాదవ్ అనే లారీ క్లీనర్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎడమ వైపు తన లారీని మలుపు తిప్పగానే ఎదురుగా ఓ మహిళా అడ్డుగా వచ్చిందని, ఆ మహిళను తప్పించబోయి ట్రక్కును మరింత ఎడమకు తిప్పగా ఎడమ నుంచే వస్తున్న సందీప్ బైక్‌కు తగిలి ఉంటుందని రణవీర్ యాదవ్ వివరించారు.
సందీప్ బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని కూడా తాను గుర్తించలేనని చెప్పారు. క్లీనర్‌గా ఉన్న వ్యక్తి ట్రక్కును ఎందుకు నడపాల్సి వచ్చిందంటే నడపడంలో తనకు అనుభవం ఉంది కనుక నడిపానని తెలిపారు. టీవీలు ప్రసారం చేసిన యాక్సిడెంట్ ఫుటేజ్ కూడా అనుమానాస్పదంగానే ఉంది. సందీప్ ఎలా మరణించారన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన, తోటి జర్నలిస్టులు ఉన్నతాధికారులకు అన్ని లేఖలు రాసినా వారు ఎందుకు స్పందించలేదన్నది సమాధానం లేని ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కచ్చితంగా సమాధానం కావాలంటూ సందీప్ నివాళి ర్యాలీలో తోటి జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment