
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్‌గంజ్‌లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment