ABP News
-
యూపీ పీఠం మళ్లీ బీజేపీదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ గెలుస్తుందని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ బలపడడం వల్ల గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లలో 100 స్థానాలు పైగా బీజేపీ కోల్పోతుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై ఓటరు నాడిని సి–ఓటర్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని, చివరికి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. అయిదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల్లో 1,07,190 మందిని ఏబీపీ–సీ ఓటర్ ప్రశ్నించింది. యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని అయితే ఈ సారి బీజేపీ 108 స్థానాలను కోల్పోయి 217 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనాకి వచ్చింది. సమాజ్‌వాది పార్టీకి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్‌కి 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఆప్‌కి 51 స్థానాలు, కాంగ్రెస్‌కి 46 స్థానాలు వస్తే, శిరోమణి అకాలీదళ్ 20 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందని, బీజేపీ స్వల్ప ఆధిక్యంతో నెగ్గుతుందని సీ–ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీకి 38 స్థానాలు, కాంగ్రెస్‌కి 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాలతో బీజేపీ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కుతుందని వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ 25–29 స్థానాలు..కాంగ్రెస్‌కు 20–24, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి 4–8, ఇతరులకి 3–7 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. -
ఐదు రాష్ట్రల్లో ఏ బీ పీ సీఓటర్ ముందస్తు సర్వే
-
యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కీలకమైన ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వీటిలో ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్ కూడా ఉండడం విశేషం. 2022లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఓటర్ల నాడిని తెలుసుకొనేందుకు ‘ఏబీపీ న్యూస్’ సంస్థ తాజాగా సి వోటర్‌తో కలిసి సర్వే నిర్వహించింది. తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై జనాభిప్రాయాన్ని సేకరించింది. ఫలితాలను రాష్ట్రాల వారీగా చూద్దాం.. ఉత్తరప్రదేశ్: హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకే మళ్లీ విజయావకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల 40 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్ల 27 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. అదృష్టం కలిసొస్తే ప్రధానమంత్రి పదవి దక్కించుకోవాలని ఆశ పడుతున్న బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత, మాజీ సీఎం మాయావతికి ఆదరణ మరింత పడిపోయింది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కేవలం 15 మంది కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం అని భావిస్తున్న ప్రియాంకాగాంధీ వాద్రా తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని3 శాతం మందే ఆశించారు. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత జయంత్ చౌదరి పట్ల 2 శాతం మంది మొగ్గు చూపడం విశేషం. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి తన ఓట్లను 0.4 శాతం పెంచుకోనుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓట్లు 6.6 శాతం పెరుగుతాయి. బీఎస్పీ 6.5 శాతం ఓట్లను, కాంగ్రెస్ 1.2 శాతం ఓట్లను కోల్పోతాయి. గత ఎన్నికల కంటే ఈదఫా బీజేపీ 62 సీట్లను కోల్పోనుంది. సమాజ్‌వాదీ పార్టీ సీట్లు మరో 65 పెరుగుతుండగా, బీఎïస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలను కోల్పోనున్నట్లు తేలింది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లున్నాయి. 2022 ఎన్నికల్లో బీజేపీ 259 నుంచి 276, సమాజ్‌వాదీ పార్టీ 109 నుంచి 117, బీఎస్పీ 12 నుంచి 16, కాంగ్రెస్ 3 నుంచి 7, ఇతరులు 6 నుంచి 10 సీట్లను దక్కించుకొనే అవకాశం ఉంది. పంజాబ్: పంజాబ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్‌ను 19 శాతం మంది కోరుకున్నారు. సీఎం అమరీందర్ పట్ల 18 శాతం మందే మొగ్గు చూపారు. ఆప్ ఎంపీ భగవంత్ మన్కు 16 శాతం, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 15 శాతం మంది మద్దతు లభించింది. గోవా: బీజేపీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పట్ల జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు 33 శాతం మంది చెప్పారు. గోవాలో అధికారం కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి తదుపరి సీఎం కావాలని 14 శాతం మంది ఆశించారు. ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా కాం్రగెస్ నేత హరీష్ రావత్‌ను 31 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత పుష్కర్‌సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికారు. మణిపూర్: మణిపూర్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. బీజేపీకి 40.5 శాతం మంది, కాంగ్రెస్‌కు 34.5 శాతం మంది ఓటర్లు అండగా నిలిచారు. -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ హత్య!
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్గంజ్లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9వ స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్ సంస్థ దేశ్ కా మూడ్ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది. ► కేంద్రం పనితీరుతో 66 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, 30 శాతం మంది సంతోషంగా లేమని సమాధానం ఇచ్చారు. అయితే నాలుగు శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ► ఈ రోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 58 శాతం మంది ప్రజలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వగా, 28 శాతం మంది మాత్రం యూపీఏ గెలుస్తుందని సమాధానం ఇచ్చారు. ► 55 శాతం మంది ప్రధాని పదవికి మోదీని ఎంచుకోగా, రాహుల్‌ను 11 శాతం మంది, మమతను 1శాతం, కేజ్రీవాల్‌ను 5, మాయావతి 1 శాతం, ప్రియాంకాను 1 శాతం మంది ఎంచుకున్నారు. వేరే నేతలను ఎంచుకుంటామని 12 శాతం మంది చెప్పారు. బెస్ట్ సీఎంలు వీరే 1) నవీన్ పట్నాయక్ – ఒడిశా 2) అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ 3) వైఎస్ జగన్మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ 4) పినరయి విజయన్ – కేరళ 5) ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర 6) భూపేశ్ బఘేల్ – ఛత్తీస్‌గఢ్ 7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్ 8) శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్య ప్రదేశ్ 9) ప్రమోద్ సావంత్ – గోవా 10) విజయ్ రూపానీ – గుజరాత్ -
కాషాయ ప్రభంజనమే!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం సోమవారం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే ఖాయమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ సాధిస్తుందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్ తేల్చాయి. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయిందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్ పేర్కొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో కూడా బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ పోల్ బీజేపీ 71, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది. న్యూస్ ఎక్స్ 77 సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‡్ష ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే తెలిపింది. -
ఏబీపీ న్యూస్–సీ ఓటర్, న్యూస్ ఫోర్ సర్వే
-
మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయని తేలింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్– సీఓటర్’, ‘సీ ఫోర్’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం దాదాపు ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది. ఏబీసీ– సీఓటర్ మూడు రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించగా, సీఫోర్ రాజస్తాన్‌లో మాత్రమే సర్వే చేసింది. అయితే, బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య గెలుచుకునే సీట్లలో ఓట్ల శాతంలో స్వల్ప తేడానే ఉండటం గమనార్హం. అందువల్ల ఎన్నికల నాటికి చోటు చేసుకునే ఏ స్వల్ప పరిణామమైనా, సీట్ల సంఖ్యలో గణనీయ మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఈ సర్వేలో సీఫోర్ రాజస్తాన్‌లో 5,788 మంది నుంచి, ఏబీపీ న్యూస్–సీ ఓటర్ మూడు రాష్ట్రాల్లో కలిపి 26, 196 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాజస్తాన్ రాజస్తాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 49.9 ఓట్ల శాతంతో 142 సీట్లలో గెలవబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. 34.3 ఓట్ల శాతంతో బీజేపీ కేవలం 56 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోనూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. సీఎం అభ్యర్థిగా పైలట్‌కు 36%, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు 27%, కాంగ్రెస్ మరో నేత అశోక్ గెహ్లాట్‌కు 24% ఓటేశారు. సీఫోర్ సర్వే కూడా కాంగ్రెస్‌కు 124 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 50%, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఈ సర్వే ఫలితాలే నిజమైతే.. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయే రాజస్తాన్ సంప్రదాయం కొనసాగినట్లవుతుంది. మధ్యప్రదేశ్ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి పరాజయం దిశగా వెళ్తోందని ఏబీపీ– సీ ఓటర్ సర్వే పేర్కొంది. అయితే, సీఎం అభ్యర్థిగా మాత్రం శివరాజ్‌సింగ్ చౌహాన్కే అత్యధికులు ఓటేశారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లను గెలుస్తుందని, బీజేపీ 108 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ 42.2%, బీజేపీ 41.5% సాధించనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 0.7 శాతమే తేడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్‌కే ఛత్తీస్‌గఢ్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. కానీ సీట్ల విషయానికి వస్తే మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 38.9% ఓట్లతో 47 సీట్లలో, బీజేపీ 38.2% ఓట్లతో 40 సీట్లలో గెలవనుందని సర్వే తేల్చింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 0.7 మాత్రమే. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా 165, 142, 49 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు వరుసగా 58, 21, 39 కావడం గమనార్హం. -
బీజేపీ పతనానికి నాంది : శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ : మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురవుతుందన్న సర్వే అంచనాల నేపథ్యంలో కాషాయ పార్టీ పతనానికి ఇది నాంది అని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా సర్వేతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. అయితే ఇదే సర్వే ప్రధాని పదవికి ఇప్పటికీ నరేంద్ర మోదీయే సరైన వ్యక్తని పెద్దసంఖ్యలో ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు పేర్కొనడం గమనార్హం. కాగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పాలక బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తున్నదని సర్వే పసిగట్టింది. -
బీజేపీకి షాక్ : ఆ మూడు రాష్ట్రాల్లో భంగపాటు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి భంగపాటు తప్పదని తాజా సర్వే స్పష్టం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీని మట్టికరిపించి సత్తా చాటుతుందని సీఓటర్, ఏబీపీ న్యూస్ చేపట్టిన సర్వే వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇమేజ్ బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఇక తాజా సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 117 స్ధానాల్లో, చత్తీస్‌గఢ్‌లోని 90 స్ధానాల్లో 54 స్ధానాలు, రాజస్తాన్‌లోని 200 స్ధానాల్లో 130 స్ధానాల్లో గెలుపొంది కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టనుంది. సర్వే అంచనాల ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించనుంది. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 106, 33, 57 స్ధానాలతో సరిపెట్టుకోవచ్చని సర్వే అంచనా వేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసిరానుంది. సర్వే అంచనాలు నిజమైతే, మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం, నూతనోత్తేజంతో బరిలో దిగేందుకు ఈ విజయాలు ఉపకరిస్తాయి. ఈ మూడు రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో సైతం ప్రధాని పదవికి అత్యధికులు నరేంద్ర మోదీవైపే మొగ్గు చూపడం గమనార్హం. -
రాజస్థాన్ లో బీజేపీకే పట్టం: నీల్సన్ సర్వే
రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్, డైనిక్ భాస్కరన్, నీల్సన్ సర్వేలో వెల్లడించింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది సర్వే తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి తిరిగి అధికారం కట్టబెట్టే అవకాశాలు కష్టమే అని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఒకవేళ అధికారంలోకి బీజేపీ వస్తే.. ఆ పార్టీ తరపున వసుంధర రాజే తగిన ముఖ్యమంత్రి అభ్యర్థి అని 56 శాతం మంది తెలిపినట్టు సర్వే రిపోర్ట్. బీజేపీకి 37 శాతం ఓట్లు రానున్నట్టు, అధికార కాంగ్రెస్ 75 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి లాంటి అంశాలు కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం చూపనున్నయని సర్వేలో వెల్లడైంది.