న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ గెలుస్తుందని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ బలపడడం వల్ల గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లలో 100 స్థానాలు పైగా బీజేపీ కోల్పోతుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై ఓటరు నాడిని సి–ఓటర్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుందని, చివరికి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. అయిదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల్లో 1,07,190 మందిని ఏబీపీ–సీ ఓటర్ ప్రశ్నించింది. యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని అయితే ఈ సారి బీజేపీ 108 స్థానాలను కోల్పోయి 217 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనాకి వచ్చింది. సమాజ్‌వాది పార్టీకి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్‌కి 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఇక పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఆప్‌కి 51 స్థానాలు, కాంగ్రెస్‌కి 46 స్థానాలు వస్తే, శిరోమణి అకాలీదళ్ 20 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందని, బీజేపీ స్వల్ప ఆధిక్యంతో నెగ్గుతుందని సీ–ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీకి 38 స్థానాలు, కాంగ్రెస్‌కి 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 40 స్థానాలున్న గోవాలో 21 స్థానాలతో బీజేపీ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కుతుందని వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ 25–29 స్థానాలు..కాంగ్రెస్‌కు 20–24, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి 4–8, ఇతరులకి 3–7 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment