ధర్మేంద్ర, షెకావత్, కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కమలదళం సన్నద్ధమవుతోంది. అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జీలను, సహ ఇన్‌చార్జీ్జలను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 403 అసెంబ్లీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆయన టీమ్‌లో సహ ఇన్‌చార్జులుగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవీతోపాటు ఎంపీలు సరోజ్ పాండే, కెప్టెన్ అభిమన్యు, వివేక్ ఠాకూర్ ఉన్నారు. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు సంస్థాగత ఇన్‌చార్జీ్జలను సైతం నియమించారు.
ఉత్తరాఖండ్‌కు ప్రహ్లాద్ జోషీ
పంజాబ్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను, కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్ పూరి, మీనాక్షి లేఖి, ఎంపీ వినోద్ చావడాను సహ ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా కీలకంగా వ్యవహరించే బ్రాహ్మణులను మెప్పించేందుకు ఇన్‌చార్జీ బాధ్యతలను అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. సహ ఇన్‌చార్జీలుగా పశ్చిమ బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ను ఖరారు చేసింది.
మణిపూర్‌కు భూపేందర్ యాదవ్
ఇటీవల కేంద్ర మంత్రి అయిన భూపేందర్ యాదవ్‌కు మణిపూర్ ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అస్సాం మంత్రి అశోక్ సింఘాల్‌ను సహ ఇన్‌చార్జులుగా నియమించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను గోవా ఎన్నికల ఇన్‌చారీ్జగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోశ్‌ను సహ ఇన్‌చార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment