Arun singh
-
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన అనురాధా పౌడ్వాల్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధా పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం ఆమె ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ సింగ్, అనిల్ బలూనీ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సనాతన ధర్మం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, బీజేపీ విధానాలు ఎంతగానో నచ్చాయని అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆమె మీడియాతో పేర్కొన్నారు. మొదట్లో సినిమా పాటలు పాడిన అనురాధా పౌడ్వాల్ తర్వాత ఆధ్యాత్మిక గీతాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. 2017లో కేంద్రం ఆమెను ‘పద్మశ్రీ’తో గౌరవించింది. -
కొడంగల్‌లో ‘బంటు’ సిద్దిపేటలో శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు పూర్తి చేసిన తర్వాత 12 మంది అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన జారీ చేశారు. బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వి.సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి స్థానాన్ని, చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు, తుల ఉమకు వేములవాడ, బొమ్మ శ్రీరామ్చక్రవర్తికి హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించింది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
దేశ సంస్కృతిలో ‘పరదా’ కూడా భాగమే
అయోధ్య: భారతదేశ సంస్కృతిలో ‘పరదా’ ఒక భాగమేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) నేత అరుణ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. హిజాబ్ ధరించే హక్కును ముస్కాన్ ఖాన్‌కు రాజ్యాంగం కల్పించిందన్నారు. హిజాబ్ అనేది దేశ సంస్కృతిలో భాగమైన పరదా లాంటిదేనని స్పష్టం చేశారు. అయితే సింగ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎంఆర్ఎం పేర్కొంది. తామెవరికీ మద్దతు ఇవ్వలేదని, కొందరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఎంఆర్ఎం ప్రతినిధి షాహీద్ సయ్యద్ చెప్పారు. విద్యాసంస్థల్లో యూనిఫామ్‌కు తాము మద్దతిస్తామని ఎంఆర్ఎం వ్యవస్థాపకుడు ఇంద్రేశ్ కుమార్ చెప్పారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడండి కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయొద్దని రాజకీయ పార్టీలను కోరారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత యూనిఫామ్ ధరించి, తరగతులకు హాజరు కావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ చెప్పారు. మరోవైపు ముస్లిం విద్యార్థులపై దాడులను 1000కి పైగా సంఘాలు ఖండించాయి. ఈ మేరకు 1,850 మంది ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు. నేను సమర్థ్ధించను హిజాబ్‌ను తాను సమర్థించనని ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్ చెప్పారు. అయితే హిజాబ్ వేసుకునే ముస్లిం విద్యార్థినులను వేధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజాబ్ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడొద్దని పార్టీలకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ గురువారం సూచించారు. మహారాష్ట్రలోని పుణేలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు హిజాబ్‌కు అనుకూలంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా నిషేధం విధించడం పట్ల పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో భారత్‌కు చెందిన ‘చార్జ్ ద అఫైర్స్’ను పిలిపించి, హిజాబ్ వ్యవహారం పట్ల తన నిరసనను తెలియజేసింది. -
ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కమలదళం సన్నద్ధమవుతోంది. అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జీలను, సహ ఇన్‌చార్జీ్జలను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 403 అసెంబ్లీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆయన టీమ్‌లో సహ ఇన్చార్జులుగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవీతోపాటు ఎంపీలు సరోజ్ పాండే, కెప్టెన్ అభిమన్యు, వివేక్ ఠాకూర్ ఉన్నారు. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు సంస్థాగత ఇన్‌చార్జీ్జలను సైతం నియమించారు. ఉత్తరాఖండ్‌కు ప్రహ్లాద్ జోషీ పంజాబ్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను, కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, మీనాక్షి లేఖి, ఎంపీ వినోద్ చావడాను సహ ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా కీలకంగా వ్యవహరించే బ్రాహ్మణులను మెప్పించేందుకు ఇన్చార్జీ బాధ్యతలను అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. సహ ఇన్‌చార్జీలుగా పశ్చిమ బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ను ఖరారు చేసింది. మణిపూర్‌కు భూపేందర్ యాదవ్ ఇటీవల కేంద్ర మంత్రి అయిన భూపేందర్ యాదవ్‌కు మణిపూర్ ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అస్సాం మంత్రి అశోక్ సింఘాల్‌ను సహ ఇన్చార్జులుగా నియమించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను గోవా ఎన్నికల ఇన్‌చారీ్జగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోశ్‌ను సహ ఇన్‌చార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది. -
నా పదవికి ఢోకా లేదు: సీఎం
శివాజీనగర: నాయకత్వ మార్పు ప్రస్తావనే లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టంచేయడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యూహాత్మక మౌనం దాల్చారు. రాష్ట్ర ఇన్చార్జ్ అరుణ్‌సింగ్ పర్యటన నేపథ్యంలో వ్యతిరేకులు ఫిర్యాదులకు పదును పెట్టగా, యడ్డి క్యాంపులో ప్రశాంతత నెలకొంది. బుధవారం మామూలుగానే కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి ఇంటికి సన్నిహిత ఎమ్మెల్యేలు, నాయకులు దండుగా వచ్చి తమ మద్దతును వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పునకు అవకాశం ఇవ్వబోమని, అరుణ్‌సింగ్‌ను కలిసి ఇదే మాటను చెబుతామని తెలిపారు. అరవింద బెల్లద్, బసనగౌడ పాటిల్ యత్నాళ్, సీపీ.యోగేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప మద్దతుతారులు.. సీఎంను మారిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మద్దతుదారులకు సీఎం సాంత్వన పలికి, ఏమీ జరగదు, నేనే సీఎంగా కొనసాగుతాను, అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపుతున్నారు. అంతా బాగుంది: అరుణ్‌సింగ్ సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో అందరూ ఒక్కటేనని, సీఎం యడియూరప్ప ప్రభుత్వం చక్కగా పాలన సాగిస్తోందని రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అరుణ్ సింగ్ అన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన తొలిరోజు బుధవారం పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. యడియూరప్ప నాయకత్వం మార్పు అనే ఊహాగానాల మధ్య అరుణ్ సింగ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యడియూరప్పను మార్చాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. తప్పుకోవడానికి తానూ రెడీ అని యడ్డి చెప్పడంతో సెగలు రేగాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్ సింగ్, సీఎం యడియూరప్ప, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు విషయంపై స్పందించా, కొత్తగా చెప్పేందుకు ఏమి లేదని అరుణ్‌సింగ్ అన్నారు. తమ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు. నేతల మధ్య విభేదాలు ఉంటే మీడియా ముందు కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని సూచించానని తెలిపారు. -
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ నాయకత్వం ఒక స్పష్టతనిచ్చింది. సీఎంగా యడియూరప్ప బాగానే పనిచేస్తుందన, ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయనను తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. యడియూరప్ప సీఎంగా కొనసాగుతారన్నారు. ఆయనతోపాటు, మంత్రులు, పార్టీ శ్రేణులు కోవిడ్ మహమ్మారి సమయంలో మంచిగా పనిచేస్తున్నారంటూ కితాబునిచ్చారు. యడియూరప్పను పక్కకు తప్పించే విషయంలో హైకమాండ్ స్థాయిలో ఎటువంటి చర్చలు జరగలేదని ఢిల్లీలో గురువారం అరుణ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌తో తాను మాట్లాడానంటూ వస్తున్నవన్నీ కేవలం ఊహలు, వదంతులేనని స్పష్టం చేశారు. యడియూరప్ప నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త అని తెలిపారు. సీఎం పదవి, నాయకత్వ మార్పిడి, రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, నేతలెవరూ వ్యాఖ్యలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా అటువంటి వాటికి పాల్పడితే వివరణ కోరుతామన్నారు. ఏదైనా విషయం ఉంటే నేరుగా తనతో మాట్లాడవచ్చని, త్వరలోనే ఆ రాష్ట్రానికి వెళ్తున్నానని అరుణ్ సింగ్ వివరించారు. చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు! చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్! -
కాంగ్రెస్‌కు కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గద్దె దింపేది తామేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను. అప్పుడు నా పార్టీనీ టీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్ఎస్ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని రాములమ్మ చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారు. కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుంది. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా.కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. తెలంగాణ ప్రజలు బాగు పడడమే నాకు కావాలి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ‘తెలంగాణలో దూకుడు పెంచండి’) -
విధి లేకపోతేనే విదేశాల్లో ఐపీఎల్
న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ టి20 టోర్నీ నిర్వహణకు ఏమాత్రం అవకాశమున్నా ఇక్కడే నిర్వహిస్తామని... ఏ దారీ లేకపోతేనే చివరి ప్రత్యామ్నాయంగా విదేశీ గడ్డ గురించి ఆలోచిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. భారత్‌లో రోజురోజుకీ కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఈ సీజన్ విదేశాల్లోనే జరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై ధుమాల్ తాజాగా వివరణ ఇచ్చారు. బోర్డు ప్రాధాన్యం సొంతగడ్డపైనే అని విధిలేని పరిస్థితుల్లోనే విదేశీ వేదికను ఎంపిక చేస్తామన్నారు. ‘తదుపరి ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా వేదికపైనే చర్చిస్తాం. మా తొలి ప్రాధాన్యత భారత్‌కే. విదేశాల్లో నిర్వహణ అనేది ఆఖరి ప్రత్యామ్నాయం మాత్రమే’ అని ధుమాల్ అన్నారు. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపీఎల్–2ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈసారి టోర్నీ గనక జరగకపోతే బోర్డుకు రూ. 4 వేల కోట్ల నష్టం వస్తుంది. అందుకే ఇంట అయినా.... బయటైనా ఈ సీజన్‌ను నిర్వహించాలనే లక్ష్యంతో బోర్డు ఉంది. -
ఐపీఎల్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామా లేదా అన్న విషయంపై తమకే స్పష్టత లేనందున... ఈ సీజన్ టోర్నీ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ తెలిపారు. ‘లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందువల్ల ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌పై చర్చిస్తాం. ఒకవేళ ఇప్పుడు వాయిదా వేసి అక్టోబర్–నవంబర్లలో లీగ్‌ను నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు కూడా మా వద్ద సమాధానం లేదు. చర్చించడానికి ఏమీ లేనందున సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్ జరగలేదు’ అని అరుణ్ ధుమాల్ వివరించారు. -
దూకుడు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంలో బీజేపీ దూకుడు పెంచడంతోపాటుగా హుజూర్నగర్ ఉపఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశించారు. బీజేపీ పక్షాన ఆర్టీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ప్రధాన కార్యదర్శులు మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల నేతలు హాజరైన ఈ సమావేశంలో హుజూర్నగర్ ఉపఎన్నికలు, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, బీజేపీ అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చించారు. అనంతరం అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. 50 వేలమంది కార్మికులు చేస్తోన్న సమ్మెపై హైకోర్టు జోక్యం చేసుకున్నా టీఆర్ఎస్ మాత్రం స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసిన రాష్ట్రబంద్‌లో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు అనేక మందిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మికుల పక్షాన పోరాటం చేసిన వారిని ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదని, కావాలంటే టీఆర్ఎస్ నాయకులు పరిశీలించుకోవచ్చన్నారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ‘గాంధీ సంకల్ప యాత్ర’కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక బీజేపీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ నాటికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈనెల 30 లోపు రాష్ట్రంలోని 34వేల బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, 891 రూరల్ మండలాలు, డివిజన్ కమిటీలను నవంబర్ 10 లోగా పూర్తి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత వచ్చే నెలాఖారు నాటికి జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల్లో పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం!
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చొరవ చూపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడంలేదు. కార్మిక సంఘాలను ఎలాంటి చర్చలకు ఆహ్వానించపోగా.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో బీజేపీ చివరి వరకు ఉంటుంది. శనివారం రోజున ఆర్టీసీ కార్మికుల బంద్‌లో పాల్గొన్న బీజేపీ నాయకులు లక్ష్మణ్‌తో పాటు చాలామంది ని అరెస్ట్ చేశారు. కార్మికుల పక్షాన పోరాటం చేసే వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదని, కావాలంటే టీఆర్ఎస్ నాయకులు విచారించుకోవచ్చని' అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావించగా బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నట్లు' ధీమా వ్యక్తం చేశారు. -
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గానూ 40 మందితో స్టార్ క్యాం పెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ మేర కు ఆ జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ అందజేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఆ జాబితాలోని నేతలంతా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో షెడ్యూల్‌ను బీజేపీ సిద్ధం చేస్తోంది. జాబితాలోని వారు.. జాబితాలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితి న్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్‌లాల్, జగత్ ప్రకాష్ నడ్డా, నిర్మలా సీతారామన్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, యోగీ ఆదిత్యనాథ్, హేమామాలిని, అరవింద్ లింబావలి, సుగుణాకర్‌రావు, పురుషోత్తం రూపాల, సాధ్వి నిరంజన్‌జ్యోతి, సౌదాన్ సింగ్, కృష్ణదాస్, మురళీధర్‌రావు, రాం మాధవ్, సయ్యద్ షానవాజ్ హుస్సేన్, జీవీఎల్ నర్సింహారావు, సురేశ్ ప్రభు ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా 13 మంది రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నిశ్చితార్థం చేసుకుని ముఖం చాటేసి..
బంజారాహిల్స్: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం కూడా చేసుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్‌కు చెందిన సీహెచ్. అనూష(21), సమీపంలోని ఓం సిమ్రాన్ అనే దుస్తుల షాపులో మేనేజర్‌గా పని చేస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమెకు ఎస్ఆర్ నగర్‌కు చెందిన అరుణ్ సింగ్(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇటీవల ఇద్దరూ నిశ్చితార్థం పేరుతో పెద్దలకు తెలియకుండా దండలు మార్చుకున్నారు. గత సెప్టెంబర్ 23న బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని అదే నెల 25న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే సెప్టెంబర్ 24న అరుణ్ సింగ్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి వాయిదా వేయాల్సిందిగా కోరాడు. అక్టోబర్ 20న మరోసారి ఆమె ఇంటికి వచ్చిన అరుణ్ తనకు రూ.10 వేలు కావాలని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అరుణ్ మళ్లీ తిరిగి రాకపోగా ఆమెతో సంబంధాలు కూడా తెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు అరుణ్సింగ్పై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. -
టీడీపీ దూరమవడం మాకే మంచిది
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినా ఎలాంటి నష్టం ఉండబోదని, ఇది బీజేపీకే లాభం చేకూర్చే పరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ కాస్త కష్టపడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన ఆయన శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ఓబీసీ మోర్చా, మీడియా కమిటీ, ఐటీ, సోషల్ మీడియా కమిటీలతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు?
పార్టీ రాష్ట్ర నేతల తీరును తప్పుపట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి సాక్షి, అమరావతి: బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్చార్జి అరుణ్‌సింగ్ పార్టీ రాష్ట్ర నేతల్ని గట్టిగా ప్రశ్నించారు. మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీసైతం గడువులు పెట్టి బెదిరింపుల సవాళ్లు చేసినా స్పందించరా? అని తూర్పారపట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు శనివారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు, ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అరుణ్‌సింగ్ ప్రసంగిస్తూ.. విజయవాడలో తనకు ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు పెద్దపెద్ద ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని.. ప్రధానమంత్రి మోదీ ఫ్లెక్సీ ఒక్కటీ కనిపించట్లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఒక్కదాన్నే దోషిగా చూపేలా మిత్రపక్ష టీడీపీసహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలని కోరారు. -
స్త్రీ నిధి.. పక్కదారి!
నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన స్త్రీ నిధి పథకం నీరుగారిపోతోంది. సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా నిధులు పక్కదారి పడుతున్నాయి. గ్రామ సమాఖ్యల అధ్యక్షులు.. తమ పరిధిలోని సభ్యుల పేరున నిధులు డ్రా చేసి స్వాహా చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లాలో నలుగురు అధ్యక్షులపై కేసులు కూడా నమోదయ్యాయి. భువనగిరి, న్యూస్‌లైన్: స్త్రీనిధి పథకం జిల్లాలో 2012లో ప్రారంభమైంది. గ్రామసమాఖ్యల సభ్యులకు స్వల్పకాలిక, అత్యవసరాలకు స్త్రీ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా రూ.30వేలు, మిగతా కులాల వారికి రూ.25వేల వరకు ఇస్తారు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 7000 సంఘాల పేరు మీద రూ.41కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అయితే వీటికి సంబంధించి ప్రతి నెలా 15వ తేదీలోగా సభ్యులు కిస్తీలు చెల్లించేలా చూసే బాధ్యతను అధికారులు విస్మరించారు. దీంతో గ్రామ సమాఖ్య అధ్యక్షులు(వీఓపీ).. సభ్యుల పేరుతో వేలాది రూపాయలు డ్రా చేసి తమ సొంతానికి వాడుకోవడంతో పాటు వడ్డీలకు కూడా తిప్పుకుంటున్నారు. వీటిని నియంత్రించాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. సభ్యుల పేరుతో డబ్బులు డ్రా జిల్లాలోని పలు మహిళా సమాఖ్యలు స్త్రీ నిధి డబ్బులను సభ్యుల పేరుతో తీసుకుని వారికి తెలియకుండానే సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు స్వయంగా సంఘాల సభ్యుల పేరుతో అప్పులను స్త్రీ నిధి నుంచి డ్రా చేసి ఇచ్చే అవకాశముంది. దీనిని ఆసరాగా చేసుకున్న వారు లక్షలాది రూపాయలు డ్రా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసి సభ్యులకు తక్కువ మొత్తంలో ఇస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన ఎంబీకేలు, ఏపీఎంలు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామ సమాఖ్యలు.. సభ్యుల పేరుతో డ్రా చేసిన మొత్తాన్ని సొంతానికి వాడుకోవడమేగాక, వడ్డీలకు ఇస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారించాలి స్త్రీ నిధిలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ దృష్టి సారించాలి. దీనిపై విచారణకు ఆదేశిస్తే పదుల సంఖ్యలో అక్రమార్కులు బయటపడతారు. లక్షల రూపాయలు సభ్యుల పేరుతో జరిగిన దుర్వినియోగం బయటపడుతుంది. లేకుంటే ఈ మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అక్రమాలు ఇలా.. భువనగిరి డివిజన్లోని ఒక సమభావన సంఘం సభ్యుల పేరున రూ.85వేలు డ్రా చేసిన గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఆ సభ్యులకు మాత్రం రూ.35వేలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.50వేలు కాజేసింది. ఆ డబ్బులు ఏడాదిలోగా చెల్లించాలని కూడా చెప్పింది. దీంతో ఏడాదిలోగా రూ.35వేలు చెల్లించారు. మిగతా రూ.50వేలు చెల్లించకపోవడంతో పావలా వడ్డీ వచ్చే పరిస్థితి లేదు. మరో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సభ్యుల పేరుతో లక్ష రూపాయలు స్త్రీ నిధి నుంచి డ్రా చేసి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి ప్రైవేట్‌గా అప్పుకిచ్చింది. సభ్యులు తమకు అప్పు రావడం లేదని అధికారుల వద్దకు వెళితే వారి పేరున లక్ష రూపాయల అప్పు ఉండడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసిన వారు మండల సమాఖ్య వద్ద చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. సిబ్బంది, అధికారులు సైతం ఏమీ చెప్పకపోవడంతో వారిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగుచోట్ల కేసులు నమోదు సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో గ్రామసమాఖ్య అధ్యక్షురాలు సభ్యుల పేరుతో స్త్రీ నిధి నుంచి నిధులు డ్రా చేసి స్వాహా చేశారు. తమ పేరున రుణాలు తీసుకున్నట్లు ఉండడంతో గ్రామసమాఖ్య సభ్యులు లబోదిబోమన్నారు. నిధులు దుర్వినియోగమైన విషయం బయటపడడంతో గ్రామసమాఖ్య అధ్యక్షురాలిపై కేసు నమోదు చేశారు. నల్లగొండ మండలం ముషంపల్లి, ఆత్మకూర్(ఎస్), హుజూర్నగర్ మండలాల్లో కూడా గ్రామసమాఖ్యల అధ్యక్షులపై కూడా కేసులు నమోదయ్యాయి. డి సెంబర్ చివరి వారంలో సోషల్ ఆడిట్ : అరుణ్‌సింగ్, డీపీఎం, నల్లగొండ కొన్నిచోట్ల స్త్రీనిధిలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నాం. ఈ నెల చివరి వారంలో సోషల్ ఆడిట్ ఉంటుంది. అప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతాం. అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటాం.