![BJP Karnataka In Charge Says Yediyurappa Will Continue As CM - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/11/BS-Yediyurappa.jpg.webp?itok=NY4SS3pK)
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ నాయకత్వం ఒక స్పష్టతనిచ్చింది. సీఎంగా యడియూరప్ప బాగానే పనిచేస్తుందన, ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయనను తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. యడియూరప్ప సీఎంగా కొనసాగుతారన్నారు. ఆయనతోపాటు, మంత్రులు, పార్టీ శ్రేణులు కోవిడ్ మహమ్మారి సమయంలో మంచిగా పనిచేస్తున్నారంటూ కితాబునిచ్చారు. యడియూరప్పను పక్కకు తప్పించే విషయంలో హైకమాండ్ స్థాయిలో ఎటువంటి చర్చలు జరగలేదని ఢిల్లీలో గురువారం అరుణ్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
ముఖ్యమంత్రిని మార్చే విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌తో తాను మాట్లాడానంటూ వస్తున్నవన్నీ కేవలం ఊహలు, వదంతులేనని స్పష్టం చేశారు. యడియూరప్ప నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త అని తెలిపారు. సీఎం పదవి, నాయకత్వ మార్పిడి, రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, నేతలెవరూ వ్యాఖ్యలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా అటువంటి వాటికి పాల్పడితే వివరణ కోరుతామన్నారు. ఏదైనా విషయం ఉంటే నేరుగా తనతో మాట్లాడవచ్చని, త్వరలోనే ఆ రాష్ట్రానికి వెళ్తున్నానని అరుణ్ సింగ్ వివరించారు.
చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు!
చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్!
Comments
Please login to add a commentAdd a comment