
ఫైల్ ఫోటో
సాక్షి బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ తెలిపింది. హిజ్రాలకు రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంగమ స్వయం సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విజయకుమార్ పాటిల్ తన వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలానుసారం అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం పోస్టులను హిజ్రాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు కర్ణాటక పౌరసేవా నియామక చట్టం–1977 సెక్షన్ 9ని సవరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే రెండు నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20కు వాయిదా వేసింది.
చదవండి: ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
Comments
Please login to add a commentAdd a comment