నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రవేశపెట్టిన స్త్రీ నిధి పథకం నీరుగారిపోతోంది. సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా నిధులు పక్కదారి పడుతున్నాయి. గ్రామ సమాఖ్యల అధ్యక్షులు.. తమ పరిధిలోని సభ్యుల పేరున నిధులు డ్రా చేసి స్వాహా చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లాలో నలుగురు అధ్యక్షులపై కేసులు కూడా నమోదయ్యాయి.
భువనగిరి, న్యూస్‌లైన్: స్త్రీనిధి పథకం జిల్లాలో 2012లో ప్రారంభమైంది. గ్రామసమాఖ్యల సభ్యులకు స్వల్పకాలిక, అత్యవసరాలకు స్త్రీ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా రూ.30వేలు, మిగతా కులాల వారికి రూ.25వేల వరకు ఇస్తారు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 7000 సంఘాల పేరు మీద రూ.41కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అయితే వీటికి సంబంధించి ప్రతి నెలా 15వ తేదీలోగా సభ్యులు కిస్తీలు చెల్లించేలా చూసే బాధ్యతను అధికారులు విస్మరించారు. దీంతో గ్రామ సమాఖ్య అధ్యక్షులు(వీఓపీ).. సభ్యుల పేరుతో వేలాది రూపాయలు డ్రా చేసి తమ సొంతానికి వాడుకోవడంతో పాటు వడ్డీలకు కూడా తిప్పుకుంటున్నారు. వీటిని నియంత్రించాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు.
సభ్యుల పేరుతో డబ్బులు డ్రా
జిల్లాలోని పలు మహిళా సమాఖ్యలు స్త్రీ నిధి డబ్బులను సభ్యుల పేరుతో తీసుకుని వారికి తెలియకుండానే సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు స్వయంగా సంఘాల సభ్యుల పేరుతో అప్పులను స్త్రీ నిధి నుంచి డ్రా చేసి ఇచ్చే అవకాశముంది. దీనిని ఆసరాగా చేసుకున్న వారు లక్షలాది రూపాయలు డ్రా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసి సభ్యులకు తక్కువ మొత్తంలో ఇస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన ఎంబీకేలు, ఏపీఎంలు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామ సమాఖ్యలు.. సభ్యుల పేరుతో డ్రా చేసిన మొత్తాన్ని సొంతానికి వాడుకోవడమేగాక, వడ్డీలకు ఇస్తున్నారు.
కలెక్టర్ దృష్టి సారించాలి
స్త్రీ నిధిలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ దృష్టి సారించాలి. దీనిపై విచారణకు ఆదేశిస్తే పదుల సంఖ్యలో అక్రమార్కులు బయటపడతారు. లక్షల రూపాయలు సభ్యుల పేరుతో జరిగిన దుర్వినియోగం బయటపడుతుంది. లేకుంటే ఈ మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.
అక్రమాలు ఇలా..
భువనగిరి డివిజన్‌లోని ఒక సమభావన సంఘం సభ్యుల పేరున రూ.85వేలు డ్రా చేసిన గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఆ సభ్యులకు మాత్రం రూ.35వేలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.50వేలు కాజేసింది. ఆ డబ్బులు ఏడాదిలోగా చెల్లించాలని కూడా చెప్పింది. దీంతో ఏడాదిలోగా రూ.35వేలు చెల్లించారు.
మిగతా రూ.50వేలు చెల్లించకపోవడంతో పావలా వడ్డీ వచ్చే పరిస్థితి లేదు. మరో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సభ్యుల పేరుతో లక్ష రూపాయలు స్త్రీ నిధి నుంచి డ్రా చేసి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి ప్రైవేట్‌గా అప్పుకిచ్చింది. సభ్యులు తమకు అప్పు రావడం లేదని అధికారుల వద్దకు వెళితే వారి పేరున లక్ష రూపాయల అప్పు ఉండడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసిన వారు మండల సమాఖ్య వద్ద చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. సిబ్బంది, అధికారులు సైతం ఏమీ చెప్పకపోవడంతో వారిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగుచోట్ల కేసులు నమోదు
సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో గ్రామసమాఖ్య అధ్యక్షురాలు సభ్యుల పేరుతో స్త్రీ నిధి నుంచి నిధులు డ్రా చేసి స్వాహా చేశారు. తమ పేరున రుణాలు తీసుకున్నట్లు ఉండడంతో గ్రామసమాఖ్య సభ్యులు లబోదిబోమన్నారు. నిధులు దుర్వినియోగమైన విషయం బయటపడడంతో గ్రామసమాఖ్య అధ్యక్షురాలిపై కేసు నమోదు చేశారు. నల్లగొండ మండలం ముషంపల్లి, ఆత్మకూర్(ఎస్), హుజూర్‌నగర్ మండలాల్లో కూడా గ్రామసమాఖ్యల అధ్యక్షులపై కూడా కేసులు నమోదయ్యాయి.
డి సెంబర్ చివరి వారంలో సోషల్ ఆడిట్ : అరుణ్‌సింగ్, డీపీఎం, నల్లగొండ
కొన్నిచోట్ల స్త్రీనిధిలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నాం. ఈ నెల చివరి వారంలో సోషల్ ఆడిట్ ఉంటుంది. అప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతాం. అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటాం.
స్త్రీ నిధి.. పక్కదారి!
Published Wed, Dec 18 2013 4:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement