దేశ సంస్కృతిలో ‘పరదా’ కూడా భాగమే | Hijab Row: MRM Leader Arun Singh Says Burqa Is Part Of Musilim Culutre | Sakshi
Sakshi News home page

దేశ సంస్కృతిలో ‘పరదా’ కూడా భాగమే

Published Fri, Feb 11 2022 9:36 AM | Last Updated on Fri, Feb 11 2022 9:36 AM

Hijab Row: MRM Leader Arun Singh Says Burqa Is Part Of Musilim Culutre - Sakshi

అయోధ్య: భారతదేశ సంస్కృతిలో ‘పరదా’ ఒక భాగమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం విభాగం ముస్లిం రాష్ట్రీయ మంచ్‌(ఎంఆర్‌ఎం) నేత అరుణ్‌సింగ్‌  అభిప్రాయపడ్డారు. హిజాబ్‌ ధరించే హక్కును ముస్కాన్‌ ఖాన్‌కు రాజ్యాంగం కల్పించిందన్నారు. హిజాబ్‌ అనేది దేశ సంస్కృతిలో భాగమైన పరదా లాంటిదేనని స్పష్టం చేశారు. అయితే సింగ్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎంఆర్‌ఎం పేర్కొంది. తామెవరికీ మద్దతు ఇవ్వలేదని, కొందరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఎంఆర్‌ఎం ప్రతినిధి షాహీద్‌ సయ్యద్‌ చెప్పారు. విద్యాసంస్థల్లో యూనిఫామ్‌కు తాము మద్దతిస్తామని ఎంఆర్‌ఎం వ్యవస్థాపకుడు ఇంద్రేశ్‌ కుమార్‌ చెప్పారు.

శాంతియుత వాతావరణాన్ని కాపాడండి  
కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయొద్దని రాజకీయ పార్టీలను కోరారు.  స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత యూనిఫామ్‌ ధరించి, తరగతులకు హాజరు కావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్‌ చెప్పారు. మరోవైపు ముస్లిం విద్యార్థులపై దాడులను 1000కి పైగా సంఘాలు ఖండించాయి. ఈ మేరకు 1,850 మంది ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు.

నేను సమర్థ్ధించను 
హిజాబ్‌ను తాను సమర్థించనని ప్రముఖ సినీ రచయిత జావెద్‌ అక్తర్‌ చెప్పారు. అయితే హిజాబ్‌ వేసుకునే ముస్లిం విద్యార్థినులను వేధించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజాబ్‌ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడొద్దని పార్టీలకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ గురువారం సూచించారు. మహారాష్ట్రలోని పుణేలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు హిజాబ్‌కు అనుకూలంగా గురువారం ర్యాలీ నిర్వహించారు.

పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ఆందోళన  
ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించకుండా నిషేధం విధించడం పట్ల పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో భారత్‌కు చెందిన ‘చార్జ్‌ ద అఫైర్స్‌’ను పిలిపించి, హిజాబ్‌ వ్యవహారం పట్ల తన నిరసనను తెలియజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement