సచిన్ పైలట్, వసుంధర రాజే
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయని తేలింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్– సీఓటర్’, ‘సీ ఫోర్’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం దాదాపు ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది.
ఏబీసీ– సీఓటర్ మూడు రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించగా, సీఫోర్ రాజస్తాన్‌లో మాత్రమే సర్వే చేసింది. అయితే, బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య గెలుచుకునే సీట్లలో ఓట్ల శాతంలో స్వల్ప తేడానే ఉండటం గమనార్హం. అందువల్ల ఎన్నికల నాటికి చోటు చేసుకునే ఏ స్వల్ప పరిణామమైనా, సీట్ల సంఖ్యలో గణనీయ మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఈ సర్వేలో సీఫోర్ రాజస్తాన్‌లో 5,788 మంది నుంచి, ఏబీపీ న్యూస్–సీ ఓటర్ మూడు రాష్ట్రాల్లో కలిపి 26, 196 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
రాజస్తాన్
రాజస్తాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 49.9 ఓట్ల శాతంతో 142 సీట్లలో గెలవబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. 34.3 ఓట్ల శాతంతో బీజేపీ కేవలం 56 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోనూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. సీఎం అభ్యర్థిగా పైలట్‌కు 36%, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు 27%, కాంగ్రెస్ మరో నేత అశోక్ గెహ్లాట్‌కు 24% ఓటేశారు. సీఫోర్ సర్వే కూడా కాంగ్రెస్‌కు 124 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 50%, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఈ సర్వే ఫలితాలే నిజమైతే.. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయే రాజస్తాన్ సంప్రదాయం కొనసాగినట్లవుతుంది.
మధ్యప్రదేశ్
గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి పరాజయం దిశగా వెళ్తోందని ఏబీపీ– సీ ఓటర్ సర్వే పేర్కొంది. అయితే, సీఎం అభ్యర్థిగా మాత్రం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కే అత్యధికులు ఓటేశారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లను గెలుస్తుందని, బీజేపీ 108 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ 42.2%, బీజేపీ 41.5% సాధించనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 0.7 శాతమే తేడా ఉండటం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్
సీఎంగా రమణ్‌సింగ్‌కే ఛత్తీస్‌గఢ్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. కానీ సీట్ల విషయానికి వస్తే మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 38.9% ఓట్లతో 47 సీట్లలో, బీజేపీ 38.2% ఓట్లతో 40 సీట్లలో గెలవనుందని సర్వే తేల్చింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 0.7 మాత్రమే.
2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా 165, 142, 49 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు వరుసగా 58, 21, 39 కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment