వేలూరులోని కస్పా ప్రాంతం లో ఇంటిలో నిద్రిస్తున్న పత్రికా విలేకరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
వేలూరు: వేలూరులోని కస్పా ప్రాంతం లో ఇంటిలో నిద్రిస్తున్న పత్రికా విలేకరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కస్పా ప్రాంతంలోని ధర్మకర్త పరమశివం వీధికి చెందిన గోపి కుమారుడు సతీష్‌కుమార్(24). ఇతని తండ్రి మృతి చెందడంతో తల్లి వనజ సీఎంసీ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అవ్వ, తాత, అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సతీష్‌కుమార్ వేలూరులో దినకరన్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వనజ విధులకు వెళ్లడంతో సతీష్‌కుమార్,అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటి మిద్దెపైన నిద్రించారు. అవ్వ, తాత బయట హాలులో పడుకుని నిద్రించారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో సతీష్‌కుమార్ అవ్వను లేపి టీ కావాలన్నాడు. అమ్మ వచ్చిన వెంటనే చేసి ఇస్తామని చెప్పి నిద్రించారు.
అనంతరం సీఎంసీ ఆసుపత్రిలో ఉన్న వనజకు వసంత్‌కుమార్ ఫోన్ చేసి సతీష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చంపేశారని తెలిపాడు. వనజ ఇంటికి వచ్చి చూడగా సతీష్‌కుమార్ శరీరంపై బట్టలు లేకుండా మెడ, కడుపు, చేతులపై కత్తులతో నరికి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయం తెలుసుకొని హత్య జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అన్న వసంత్ కుమార్ కూడా తలుపులు వేసుకొని నిద్రిస్తున్న సమయంలో ఎవరు హత్య చేసి ఉండవచ్చునని విచారణ జరిపారు. ఇంటి వెనుక వైపున సతీష్‌కుమార్‌ను హత్య చేసిన కత్తులు, మిద్దెపైన రక్తపు మరకలు ఉన్నట్లు గమనించారు. సతీష్‌కుమార్‌కు సెల్‌ఫోన్ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.