♦ మండలిలో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
♦ త్వరలో అఖిలపక్ష భేటీలో చర్చ
ముంబై : పాత్రికేయుల రక్షణ చట్టం కోసం డ్రాఫ్టు బిల్లును నెల రోజుల్లోపు రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శాసనసభ, శాసన మండలి ప్రతిపక్ష నేతలు, గ్రూపు లీడర్లతో చర్చించిన అనంతరం మండలిలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాలింగ్ అటెన్షెన్ మోషన్‌లో భాగంగా మాట్లాడిన మండలి ప్రతిపక్షనేత ధనంజయ్ ముండే, రానురాను జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, వారి రక్షణ బాధ్యత ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. శాంతాకృజ్‌లో సిలిండర్ పేలుడు ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగిందని, బార్ గురించి తెలుసుకోడానికెళ్లిన మరో జర్నలిస్టు హత్యకు గురయ్యాడని చెప్పారు. జర్నలిస్టుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్ని రోజుల్లో బిల్లు రూపొందిస్తారో చెప్పాలని డిమాండు చేశారు.
ఇందుకు వివరణగా హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ, ‘బిల్లు రూపొందించడానికి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ మంత్రిమండలికి నివేదిక కూడా అందజేసింది. అయితే దాని మీద ఇంతవరకు చర్చ మాత్రం జరగలేదు. ఆ కమిటీలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ బిల్లుకు తుది రూపమివ్వలేదు. కొత్త బిల్లు రూపొం దించడానికి ముందే నారాయణ్ రాణే కమిటీ నివేదికను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది’ అని వివరించారు. జర్నలిస్టుల భద్రతకు సంబంధించి డెరైక్టర్ జనరల్ తాజాగా సూచనలిచ్చారని చెప్పారు. ‘నెల రోజుల్లోపు డ్రాఫ్టు బి ల్లు రూపొందిస్తాం. అంతకుముందే ఇరు సభల ప్రతిపక్ష నేతలు, గ్రూపు లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.