జర్నలిస్టు హత్య.. ముగ్గురి అరెస్టు
గుజరాత్‌లో జర్నలిస్టు కిశోర్ దవే (53) హత్యకేసులో ముగ్గురిని అరెస్టుచేశారు. తన కార్యాలయంలో వార్తుల రాస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయనను పొడిచి చంపిన విషయం తెలిసిందే. 'జైహింద్' అనే గుజరాతీ వార్తాపత్రికకు సౌరాష్ట్ర ప్రాంతంలోని జూనాగఢ్ నగరంలో బ్యూరోచీఫ్‌గా వ్యవహరిస్తున్న దవే సోమవారం రాత్రి ఓ స్టోరీ రాస్తుండగా 9 గంటల ప్రాంతంలో అతడిని పదే పదే కత్తులతో పొడిచి చంపారు. ఆ సమయానికి ఆఫీసులో ఆయనకొక్కరే ఉన్నారు. ఆఫీసు కూడా ఒకే గదిలో ఉండటంతో అందులో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏమీ లేవు. కాసేపటి తర్వాత వచ్చిన ఆఫీసు బోయ్ దవే మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపాడు.
వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికరి ఒకరు తెలిపారు. అయితే.. బీజేపీ స్థానిక నాయకుడు రతీలాల్ సూరజ్ కొడుకే ఈ హత్య చేయించి ఉంటాడని దవే బంధువులు ఆరోపిస్తున్నారు. సూరజ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. దవే ఉప్పు అందించడం వల్లే కొన్ని స్థానిక పత్రికలలో తనపై లైంగిక ఆరోపణల కథనాలు వచ్చాయని రతీలాల్ కొడుకు డాక్టర్ భవేష్ సూరజ్ ఇంతకుముందు ఆరోపించారు. వాట్సప్ మెసేజిల ద్వారా సదరు డాక్టర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో దవే ఇంతకుముందు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అరెస్టయ్యారు.