న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్‌ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది.
కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్‌తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్‌ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్లు ఎన్‌సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్‌దారాపూర్‌లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment