బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు 20సార్లు కొకైన్ సరఫరా
ఏడుసార్లు విమానంలోనే ప్రయాణించిన నైజీరియా యువతి
నైజీరియన్ డాన్ సుజీకి హైదరాబాద్ కొరియర్ ఈమెనే
దర్యాప్తులో గుర్తించిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ సిండికేట్‌లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కింగ్‌పిన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని దందా నిర్వహించేవాడు. నగరానికి ఒకరిని చొప్పున అంకితమైన డ్రగ్ పెడ్లర్‌ను నియమించుకునేవాడని, ఈక్రమంలో హైదరాబాద్‌కు అనోహా బ్లెస్సింగ్ కొరియర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఇటీవల తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్), సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడెషోలాతో సహా ఐదుగుర్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
నకిలీ పాస్‌పోర్టుతో..
2018లో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్.. కొంతకాలానికి బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టయిలిస్ట్‌గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెడ్లర్‌తో పరిచయం పెంచుకుంది. తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా సుజీ ఆదేశాల మేరకు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.
పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సా దేశం పాస్‌పోర్టును తీసుకుంది. కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతుండేది. 2019 సెప్టెంబర్ 27న ఒకసారి ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్‌తో 20సార్లు హైదరాబాద్‌కు..
సుజీ సూచనల మేరకు ఆమె నివసించే బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్‌ను తీసుకొని హైదరాబాద్‌కు సరఫరా చేసేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా.. ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని, 13 సందర్భాల్లో రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకుందని ఓ అధికారి తెలిపారు.
బ్లెస్సింగ్ తన బ్యాగేజ్లో కొకైన్ దాచి పెట్టి, దాన్ని విమానం ఎక్కేక్రమంలో చెకిన్ లగేజ్‌లో ఇచ్చేదని, విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల ఉనికి గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనానికి ఇదొక ఉదాహరణనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ డ్రగ్ పార్సిల్‌ను లంగర్‌హౌస్‌లోని సన్‌సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు అందజేస్తుంది.
ఈమె డ్రగ్స్‌ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని, డ్రగ్స్ హైదరాబాద్‌కు చేర్చిన ప్రతీసారి సుజీ... బ్లెస్సింగ్‌కు రూ.20 వేలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్‌కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సుజీ పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment