Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌.. డీఎంకే మాజీ నేత అరెస్ట్‌ | Narcotics Control Bureau: NCB arrests Tamil film producer Jaffer Sadiq in drug racket | Sakshi
Sakshi News home page

Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌.. డీఎంకే మాజీ నేత అరెస్ట్‌

Published Sun, Mar 10 2024 5:03 AM | Last Updated on Sun, Mar 10 2024 5:03 AM

Narcotics Control Bureau: NCB arrests Tamil film producer Jaffer Sadiq in drug racket - Sakshi

తమిళ, హిందీ చిత్ర పరిశ్రమతోనూ సంబంధాలు

పార్టీలకూ నిధులిచ్చిన వైనం

డీఎంకే ముఖ్య నేతకు సమన్లు?

న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్‌ సాదిక్‌ (36)ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఎన్‌సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్‌ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్‌ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

మూడు దేశాలకు స్మగ్లింగ్‌
భారత్‌ నుంచి కొబ్బరి పొడి, మిక్స్‌ ఫుడ్‌ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్‌ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ 2023 డిసెంబర్‌లో ఎన్‌సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్‌లో సాదిక్‌ కీలక సూత్రధారిగా తేలాడు.

పైరేటెడ్‌ సీడీల నుంచి మొదలైన దందా
సాదిక్‌ దందా పైరేటెడ్‌ సీడీలతో మొదలైంది. కెటమైన్‌ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్‌ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్‌ డ్రగ్‌. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement