అయోమయంలో అళగిరి!
డీఎంకే నుంచి బహిష్కృతుడైన అళగిరి అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈనెల 17వ తేదీన తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పిన అళగిరి సోమవారం మదురైలో నిర్వహించిన సమావేశంలో పార్టీ పెట్టేది లేదని, డీఎంకేను కాపాడుకోవడమే తన లక్ష్యమంటూ చెప్పడంతో మద్దతుదారులందరూ అయోమయంలో పడిపోయారు.
చెన్నై : రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండగా డీఎంకే కార్యక్రమాలకు దూరమై అళగిరి వర్గం దాదాపు ఖాళీగా ఉంది. గత వారం రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీ అగ్రనేతలతోపాటూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను సైతం కలిసిన అళగిరి 17వ తేదీన తన నిర్ణయా న్ని ప్రకటిస్తానని తెలిపారు. భారీ సంఖ్యలో అనుచరులు హాజరుకాగా మధురైలో సోమవారం ఆయన సమావేశమైన్నారు. కొత్తగా పార్టీని పెట్టబోయేది లేదని స్పష్టం చేయడం ద్వారా అనుచరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
డీఎంకే అధినేత తనకు తండ్రి, అంతేకాదు పార్టీ అధినేత, తాను తప్పుచేశానని క్షమాపణ కోరడంలో తప్పులేదని పేర్కొనడం ద్వారా మళ్లీ డీఎంకేలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పొరపాట్లు, సంస్థాగత ఎన్నికలు జరగకుండానే పార్టీ పదవుల్లో నియామకం వంటివి కరుణ దృష్టికి తెచ్చినందుకు తొలగించారని తెలిపారు. పోస్టర్లు వేయడమే తమవర్గానికి నష్టం చేసిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాత పోస్టర్లు వదిలేస్తే తాజాగా కలైంజర్ డీఎంకే అంటూ మళ్లీ పోస్టర్లు వేయ డం వల్ల తాను అదేపేరుతో కొత్తపార్టీ పెడుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు.
డీఎంకేనే కలైంజర్గా ఉన్నపుడు మరో కలైంజర్ డీఎంకే పార్టీ ఎందుకని వ్యాఖ్యానించారు. ఇకపై పోస్ట ర్లు వేయవద్దని అంటూనే డీఎంకేనే కలైంజర్, కలైంజరే డీఎంకే అనే నినాదంతో ఒక పోస్టరు వేయాల్సిందిగా ఆదేశించారు. కరుణ కొందరి కంబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నారని, ఆ ఇబ్బందులు ఏమిటో తనకు తెలిపితే ఆయనను విడిపించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎండీకేల నుంచి వచ్చిన కొందరు కరుణ ఆంతరంగికులుగా మారి ద్రోహాన్ని తలపెడుతున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు.
డీఎంకేను, తండ్రి కరుణానిధిని ఇటువంటి దుష్టశక్తుల నుంచి కాపాడుకోవడం తన ముందున్న తక్షణ కర్తవ్యమని చెప్పారు. పార్టీకి పూర్తిస్థాయిలో నమ్మకమైన వ్యక్తిని తాను మాత్రమేనని ప్రకటించుకున్నా రు. ఇటీవల రజనీకాంత్‌ను కలుసుకున్నపుడు రాజకీయాలపై చర్చించలేదన్నారు. కుటుంబ పరంగా తనకు జరిగిన కష్టాన్ని రజనీతో పంచుకుని ఈ సమయంలో ఓదార్పుగా పలకరించినందుకు కృత జ్ఞతలు తెలిపానని చెప్పారు. ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చని ఆయన హామీ ఇచ్చారని అళగిరి తెలిపారు. కరుణ నుంచి సానుభూతి పొందేలా అళగిరి ప్రసంగం సాగడం ద్వారా డీఎంకేలో పునఃప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అళగిరి మద్దతుదారులు మళ్లీ డీఎంకేలోకి వెళ్లాలా వద్దా అనే అయోమయంలో పడిపోయూరు.