International Drug Racket
-
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని లూథియానా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సోమవారం పేర్కొంది. ఇద్దరు అఫ్గాన్లు సహా 16 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 60 కిలోల డ్రగ్స్, 31 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ‘‘ఈ ముఠాకు గతేడాది ఢిల్లీలోని షహీన్‌బాగ్, యూపీలోని ముజఫర్నగర్ల్లో పట్టుబడిన డ్రగ్స్‌తో సంబంధముంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది’’ అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు. -
నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి
ముంబై: 1990వ దశకంలో కరణ్ అర్జున్, ఆషికీ అవారా వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన భామ మమతా కులకర్ణి.. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఈమె ముంబైలో ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న మమతా కులకుర్ణి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు తెలిపింది. ఒకప్పుడు అందాల శృంగార తారగా వెలుగొందిన తాను ఇప్పుడు యోగినిగా మారానని, తన ఆత్మకథను చదివితేనే.. తన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరిస్తానని ఆమె తెలిపింది. నైరోబీలో ఉన్న ఆమె ఈమెయిల్ ద్వారా తన ఆత్మకథను పంపి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. బాలీవుడ్లో టాప్-2 హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్‌గిరి మహారాజ్ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు ఆమె తెలిపింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మమతా కులకర్ణి డ్రగ్స్ మాఫియా నేరగాడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడి.. అర్ధాంతరంగా దుబాయ్ వెళ్లిపోయింది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది. ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని, పోలీసులే కావాలని తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది. తన ఆత్మకథ చదివితే తానేమిటో అందరికీ అర్థమవుతుందని, తనపై కేసులు కూడా తేలిపోతాయని ఆమె పేర్కొంది.