ఓ కారు డ్రైవర్ అతివేగం కుటుంబం మొత్తాన్ని చిదిమేసింది. భార్యాభర్తలతో పాటు వాళ్ల కొడుకు కూడా మరణించాడు. ఇంటి దగ్గర ఉండిపోయిన ఆరు నెలల చిన్నారి అనాథగా మారింది. ఈ విషాదకరఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో రామ్ సజీవన్ అనే వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా ఎర్రలైటు పడటంతో సిగ్నల్ వద్ద ఆగాడు. వెనక సీటుమీద భార్య సుందర, ముందు రాడ్ మీద కొడుకు ముకేష్ కూర్చున్నారు. వాళ్లు అలా ఆగారో లేదో.. వెనక నుంచి సిల్వర్ కలర్ శాంత్రో కారు ఒకటి వచ్చి సైకిల్‌ను ఢీకొట్టింది. దాంతో వాళ్లు ముగ్గురూ గాల్లోకి ఎగిరి, డివైడర్‌కు అవతలివైపు రోడ్డుమీద పడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న తమ కూతురికి మందులు కొనుక్కోడానికి బయటకు వెళ్లిన సజీవన్ కుటుంబం.. అలా నిర్జీవంగా మిగిలిపోయింది.
కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినా, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ప్రమాదస్థలంలో కారు నంబర్ ప్లేటు కూడా పడిపోవడంతో డ్రైవర్‌ను గుర్తించడం సులభమైంది. ఆ సమయానికి అక్కడ ఉన్నవాళ్లు కారు పగిలిన విడిభాగాలను సేకరించారు. వాటిలో నంబర్ ప్లేటు కూడా ఉంది. వాటన్నింటినీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా చూసి, శివకుమార్ అనే కారు డ్రైవర్‌ను అతడి ఇంటి వద్ద అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే సమయానికి తాను కూడా వాళ్ల వెనకాలే సైకిల్ మీద వెళ్తున్నానని, ఉన్నట్టుండి వాళ్లు గాల్లో ఎగిరి రోడ్డుకు అవతలివైపు పడిపోయారని, అయితే కారు బాగా వేగంగా వెళ్లిపోవడంతో పట్టుకోలేకపోయామని సుందర అన్న శారదా ప్రసాద్ తెలిపారు.
అనాథగా చిన్నారి..
ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అన్నను కూడా పోగొట్టుకున్న 6 నెలల రిధి అనాథగా మారిపోయింది. ఎప్పుడూ అమ్మానాన్నలతోనే ఉండటంతో... వాళ్లకోసం విపరీతంగా ఏడుస్తోంది. ఇంకా తల్లిపాలే అలవాటు ఉండటంతో కనీసం సీసాతో పాలు కూడా తాగడం లేదు. ఆమెను ఎలా సముదాయించాలో తమకు అర్థం కావడం లేదని.. సజీవన్ ఇంటి పక్కనే ఉండే అతడి బావమరిది శారదా ప్రసాద్ చెప్పారు.
హిట్ అండ్ రన్.. అనాథగా 6 నెలల చిన్నారి!
Published Thu, May 4 2017 10:06 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
Advertisement
Advertisement