రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. మాఫీ విధివిధానాలపై చర్చ.. ఖరారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివా లయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమై వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై చర్చించి ఖరారు చేయనుంది. రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం విధివిధానాలనే వర్తింపజేయాలా? లేక ఇతర పద్ధతులను అనుసరించాలా? అనే అంశంపై రాష్ట్రమంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం అందిస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ఉన్నత ఆదా యం పొందే సంతానం ఉన్నా ఈ పథకం కింద అనర్హులే. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు సైతం ఇలాంటి మార్గదర్శకాలనే అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులైన రైతులెవరూ నష్టపోకుండా మార్గదర్శకాలను మంత్రివర్గం ఖరారు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎవరు ? ప్రభుత్వ సహాయం అవసరమున్న రైతులను ఏ ప్రాతిపదికన గుర్తించి రుణమాఫీ వర్తింపజేయాలి ? ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీకి అమలు చేసిన మార్గదర్శకాలు ఏమిటి? వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రుణమాఫీకి కటాఫ్ తేదీతోపాటు ఈ పథకం అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీపైనే చర్చ జరుగుతుందని, ఎజెండాలో ఇతర అంశాలు లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment