ఒకే దఫా రుణమాఫీ | Telangana cabinet approves farm loan waiver | Sakshi
Sakshi News home page

ఒకే దఫా రుణమాఫీ

Published Sat, Jun 22 2024 5:40 AM | Last Updated on Sat, Jun 22 2024 5:40 AM

Telangana cabinet approves farm loan waiver

ఇందు కోసం రూ.31 వేల కోట్లు అవసరం.. 

మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి..

కేబినెట్‌ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

మంత్రివర్గ సమావేశంలో మాఫీ విధివిధానాలపై చర్చ  

సోనియా పుట్టిన రోజైన డిసెంబర్‌ 9 కటాఫ్‌ తేదీ

మంత్రివర్గం ఏకతాటిమీద నిలిచి, ఏక గొంతుకతో  ఈ నిర్ణయం తీసుకుంది

2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ మధ్య రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ 

గడువులోగానే రుణమాఫీ చేస్తాం.. విధివిధానాలపై త్వరలో జీవో 

మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు ఇచ్చే సమాచారమే అధికారికం

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దఫాలో రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది.  ఇందు­కు రూ. 31 వేల  కోట్లు అవసరమని పేర్కొంది. సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్‌ 9వ తేదీని రుణమాఫీకి కటాఫ్‌గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. అనంతరం సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే మడమ తిప్పని నాయకులు 
‘2022 మే 6వ తేదీన వరంగల్‌లో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించారు. అందుకు సంబంధించి మంత్రివర్గంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న కాంగ్రెస్‌ విధానంతో ముందుకుపోతున్నాం. సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ఖర్గే మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు. 

2004లో కరీంనగర్‌లో తెలంగాణ ఇస్తానన్న మాటను సోనియా నిలబెట్టుకున్నారు. దానివల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్‌ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు అందరికీ తెలుసు. సోనియా మాత్రం ఇచ్చిన మాట­కు కట్టుబడి తెలంగాణ ఇచ్చారు. సోని­యాగాంధీ ఏదైనా మాట చెప్పారంటే అది శిలాశాసనమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడతారు. రూ.2 లక్షల రుణమాఫీపై మేధావులు, విశ్లేషకులు కూడా కాంగ్రెస్‌వి అలవి కాని మాటలు అంటూ వ్యాఖ్యానించారు..’ అని సీఎం గుర్తు చేశారు.  

ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ విముక్తి 
    ‘కేబినెట్‌లో రుణమాఫీ విధివిధానాలపై చర్చించాం. త్వరలో జీవో విడుదల చేస్తాం. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి అవసరమైన సొమ్మును సేకరించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తాం.

ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం 2014, 2018లలో రెండుసార్లు రుణమాఫీ చేసింది. మొదటిసారి రూ.16 వేల కోట్లు, రెండోసారి రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. ఇలా రెండు విడతలుగా చేసిన రుణమాఫీ మొత్తం రూ.28 వేల కోట్లు మాత్రమే. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబర్‌ 11వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది..’ అని రేవంత్‌ చెప్పారు.  

8 నెలల్లోగానే రుణమాఫీ 
    ‘గత ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు, వడ్డీ మాపీ చేస్తామని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను సంక్షోభం వైపు తీసుకెళ్లి అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది. పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో రెండున్నర నెలలు కోడ్‌లోనే గడిచిపోయాయి. అయితే 8 నెలల్లోపే సామాజిక బాధ్యతతో రుణమాఫీకి చేసేందుకు మంత్రివర్గం మొత్తం ఏకతాటిమీద నిలిచి, ఏక గొంతుకతో నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల్లోని రైతు రుణాల వివరాలను సేకరించాం..’ అని సీఎం తెలిపారు.  

నిధుల సేకరణ బాధ్యత ఆర్థిక మంత్రిది 
    ‘రుణమాఫీకి నిధుల సేకరణ ఆర్థిక మంత్రి భట్టి బాధ్యత. ఈ విషయంలో ఏదైనా ఉంటే ఆయన్ను సంప్రదించవచ్చు. ఏ ప్రాతిపదికన చేస్తామనేది మా అంతర్గత అంశం. అయితే గడువులోగానే చేస్తాం. ఆయనలాగా (కేసీఆర్‌) వాయిదాలతో చేయాలంటే ఇంత హడావుడి ఎందుకు? గడువు కంటే ముందు చేస్తే మీకేమైనా (విలేకరులకు) అభ్యంతరమా? తినబోతూ రుచులెందుకు? దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు. నియమ నిబంధనలు అన్నీ జీవోలో పొందుపరుస్తాం..’ అని రేవంత్‌ చెప్పారు.  

రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం 
    ‘రైతు భరోసా (గతంలో రైతుబంధు)పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు, ధనికులకు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశాం. 

రైతు ప్రతినిధులు, రైతు సంఘాలు సహా పలువురు స్టేక్‌ హోల్డర్లతో చర్చించి జూలై 15వ తేదీలోగా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతుభరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

కొన్ని పత్రికలు లేనిపోనివి రాస్తున్నాయి.. 
    ‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలన పరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించాం. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం. ఏదైనా సమాచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి. కొన్ని పత్రికలు లేని వార్తలను రాస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎక్కడో ఒకదగ్గర ఎవరో ఏదో మాట్లాడారని చెబుతూ వార్తలు రాస్తున్నాయి. 

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై, అలాగే అపోహాలపై సమాచారం కావాలంటే ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించాలి. ఊహించుకొని, కాయించుకొని రాయకుండా ఇలా చేశాం. మిగతా విషయాలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల మంత్రులు ఇస్తారు. అయితే రాజకీయాలపై ఎవరైనా ఏదైనా మాట్లాడతారు..’ అంటూ రేవంత్‌ వివరించారు.  

సాహసోపేతమైన నిర్ణయం: తుమ్మల 
    రుణమాఫీ ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఆర్థికంగా ఎంత కష్టమున్నా, ఇబ్బంది ఉన్నా రుణమాఫీ చేయడానికి పూనుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  

మాఫీ లెక్క తేలిందా? 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అయితే ఒక్క 2023– 24లోనే తెలంగాణలో రైతులు ఏకంగా రూ. 64,940 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని 2022 మే నెలలోనే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో గత ఏడాది రుణాలు తీసుకున్న చాలామంది రైతులు తిరిగి చెల్లించలేదని బ్యాంక్‌ వర్గాలు అంటున్నాయి. కాగా ఒక్క ఏడాదిలో రూ. 64 వేల కోట్ల రుణాలుంటే రూ. 31 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడమేమిటని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఏడాదికే ఇంత తేడా ఉంటే.. ఐదేళ్లకు ఎంత ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ లెక్కలపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement