అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది | Former minister Harish Rao Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది

Published Fri, Aug 16 2024 4:17 AM | Last Updated on Fri, Aug 16 2024 4:17 AM

Former minister Harish Rao Comments On CM Revanth Reddy

రుణమాఫీ పూర్తిచేశామన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంత దిగజారుడు సీఎం ఇంకెవ్వరూ లేరు

దగా చేసినట్లు తెలిశాక రాజీనామా ఎవరు చేయాలి? 

సాక్షి, హైదరాబాద్‌: దిగజారుడు భాషలో నోటికొచ్చినట్లు బీఆర్‌ఎస్‌ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హితవు చెప్పారు. రుణమాఫీపై మాటతప్పి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం అవాకులుచెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు ప్రవర్తించడం లేదనే విషయాన్ని రేవంత్‌ ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని విమర్శించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్‌ ప్రవర్తన ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్‌ఎస్‌పై, తనపై విమర్శలకు దిగారని విమర్శించారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్‌ 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. తర్వాత అది నెరవేర్చలేక పార్లమెంట్‌ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టి, ఇప్పుడు రూ.13 వేల కోట్లు కోత పెట్టారన్నారు. అయినా ఎవరూ నమ్మడం లేదని, ప్రతి ఊరి దేవుడి మీద రేవంత్‌ ప్రమాణాలు చేశారని చెప్పారు.

మోసమే తన విధానం..
‘సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా రేవంత్‌ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే దాదాపు రూ.17 వేల కోట్లు అయ్యిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే ఈ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతోందన్నారు.

రుణమాఫీ పేరుతో దగా చేశారని స్పష్టంగా తేలిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏట్లో దూకి ఎవరు చావాలి? అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే కాక దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి, మాట తప్పిన ఆయన చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. కానీ ఆయనకు ఆ సంస్కారం లేదని, రేవంత్‌లో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదని విమర్శించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, ఆ పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని తాను ఆందోళన చెందుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ చేసిన తప్పుకు, దైవ ద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్లు హరీశ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement