సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది.
ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్‌ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు.
20 నుంచే రంగంలోకి కిషన్‌రెడ్డి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు.
భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment