డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
రుణమాఫీ కింద బ్యాంకులకు రూ.18 వేల కోట్లు ఇచ్చాం..
కొత్త రుణాలు రూ.7,500 కోట్లే ఇచ్చారంటూ అసహనం
రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని విజ్ఞప్తి
ప్రజాభవన్‌లో ఎస్‌ఎల్‌బీసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు.
రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం రూ.18 వేల కోట్లు జమ చేస్తే, బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు రూ.7,500 కోట్లు మాత్రమేనంటూ అసహనం వ్యక్తం చేశారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగం
రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని భట్టి చెప్పారు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరచడం హర్షణీయమన్నారు.
రూ.2,005 కోట్లు పెరిగిన డిపాజిట్లు
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,005 కోట్ల మేరకు డిపాజిట్లు పెరిగాయని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్రబరార్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రూ.17,383 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.23,848 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.220.49 కోట్ల మేర విద్యారుణాలు ఇచ్చినట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.57.079 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రాధాన్యతా సెక్టార్‌లకు మొత్తం రూ.1,00,731 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ కమల్‌ప్రసాద్ పట్నాయక్, నాబార్డు సీజీఎం సుశీలా చింతల తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలి: తుమ్మల
కేవలం అంకెలు చదువుకునేందుకు మూడు నెలలకో సారి మీటింగ్‌లు పెట్టడం, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. కష్టకాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రుణమాఫీ కింద విడుదల చేసిందని చెప్పారు. రుణ ఖాతాల్లో తప్పులు సరిది ద్దేటట్లు బ్రాంచ్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లని కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment