రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయనకు చూపిస్తా
దీనిపై రాహుల్‌ను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నాడు
అందుకే వరంగల్ సభకు మూడుసార్లు పిలిచినా రాలేదు
మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ జరగలేదని ఓవైపు మంత్రులు చెబుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీలో రాహుల్ గాం«దీని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకే వరంగల్ సభకు రావాలని రేవంత్ మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ రావట్లేదు.
హైదరాబాద్‌కు రాహుల్ వస్తే విమానాశ్రయంలోనే స్వాగతం పలికి సీఎం సొంతూరుకు తీసుకెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయనకు చూపిస్తాం’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో హరీశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్ చిట్‌చాట్ పేరిట ‘చీట్‌చాట్’(మోసగించే ముచ్చట్లు) చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వాల్మికి స్కామ్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని.. ఈ స్కామ్‌పై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఈడీ విచారణ జరగట్లేదని హరీశ్‌రావు ఆరోపించారు. దీనిపై విచారణ కోసం త్వరలో ఈడీని కలుస్తామని చెప్పారు.
హైడ్రా ఆఫీసును రంగనాథ్ కూల్చివేయాలి
‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని... దేవుళ్లపై ఒట్లతో ప్రజల విశ్వాసాన్ని కూల్చేసింది. బుద్ధ భవన్ నాలా కింద ఉన్న హైడ్రా ఆఫీసును కమిషనర్ రంగనాథ్ కూలగొట్టి ఇతర భవనాల వైపు చూడాలి. జీహెచ్‌ఎంసీ ఆఫీసు, నెక్లెస్ రోడ్డు రెస్టారెంట్లు, మీరాలం, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లోని నిర్మాణాలు కూడా కూలుస్తారో లేదో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఫోర్త్ సిటీ పేరిట భూములు కొల్లగొట్టే కుట్ర
ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సర్వే నంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని... తుక్కుగూడలో సర్వే నంబర్ 895లో 25 ఎకరాలను పేద రైతుల నుంచి బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరిట భూములు కొంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తే మంత్రులెవరూ రాలేదని హరీశ్ ఎద్దేవా చేశారు.
కవిత బెయిల్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’మొట్టికాయలు
‘సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ధి ఉన్నవారికి అన్నీ వంకరగానే కనిపిస్తాయి. బీజేపీ ఇస్తేనే ఓటుకు రూ. కోట్లు కేసులో రేవంత్‌కు బెయిల్ వచ్చిందా? ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
కవితకు బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. ఈడీ, సీబీఐ తీరుపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే అది బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీ అనడం రేవంత్ అపరిపక్వతకు నిదర్శనం’అని హరీశ్ విమర్శించారు.
విద్యార్థులను ఎలుకలుకరవడం దారుణం
మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేయడం దారుణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలవగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment