ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం
విధివిధానాలు ఖరారు చేయనున్న ప్రభుత్వం
ఆగస్టు 15లోగా రుణమాఫీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి.. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు.
కటాఫ్ తేదీ ఏది?
మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు.
కేంద్రం మాదిరి ఉద్యోగులు, డాక్టర్లు తదితరులకు మినహాయింపు?
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్టులు లాంటి ప్రొఫెషనల్స్‌ను ఈ పథకం నుంచి మినహాయించింది.
పీఎం కిసాన్ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చాయనే అభిప్రాయం ఉంది. ఈ మేరకు రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment