
సీఎం రేవంత్, మంత్రి వర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంది
బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్య
పార్టీ సీనియర్ సభ్యులు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించాలి
గత ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది
ప్రభుత్వ అప్పులు, బడ్జెట్ లెక్కలపై అధ్యయనం చేయాలి
ప్రతి అంశంపై ఆధారాలతో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి
రైతాంగ సమస్యలే కేంద్రంగా నిలదీయాలి
బీఆర్‌ఎస్‌పై నిందలను బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రికి అనుభవం, జ్ఞానం లేకున్నా కనీసం కామన్ సెన్స్‌ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవజు్ఞలు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం, మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది.
హామీలు, పథకాల అమలును పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలైన సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అసెంబ్లీలో ఎత్తిచూపడమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలు, వేస్తున్న నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీఆర్‌ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అప్పులు సహా.. అన్నీ అబద్ధాలే!
‘‘రాష్ట్ర అప్పుల లెక్కలపై రేవంత్, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గత ఏడాదికాలంలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైంది. బడ్జెట్‌తోపాటు సవరించిన అంచనాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెడుతుంది. ఆదాయ లోటు కూడా భారీగా ఉండబోతోంది. అందువల్ల బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేయండి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులుగా పనిచేసినవారు మన పార్టీ తరఫున ఉభయ సభల్లోనూ ఉన్నారు.
వారు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించి పద్దులపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగునీటి కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ కోతలు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతుండటం, ఎండుతున్న పంటలు వంటి రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వివిధ రంగాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎత్తిచూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు సోషల్ మీడియా అద్దం పడుతోందని, నిజానికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నెలకొందని పేర్కొన్నారు.
నలుగురు సభ్యులు గైర్హాజరు
బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీకి నలుగురు సభ్యులు ముందస్తు సమాచారం ఇచ్చి గైర్హాజరు అయ్యారు. వ్యక్తిగత పనులతో తాము సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిపారు. గైర్హాజరైన వారిలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఉన్నారు.
దాదాపు 25 అంశాలపై దిశానిర్దేశం
సుమారు మూడు గంటల పాటు సాగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దాదాపు 25 అంశాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్‌సీ తదితరాలపై గొంతు వినిపించాలని సూచించారు. మహిళలు, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లు, వైద్యరంగంలో దిగజారిన ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేత, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం వంటి అంశాలు ప్రస్తావించాలన్నారు.
ఏపీ నదీ జలాల చౌర్యం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో 20శాతం కమిషన్ల ఆరోపణలు, పరిశ్రమల ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధన, కులగణనలో తప్పులు, బెల్ట్‌షాపుల తొలగింపు, ఎల్‌ఆర్‌ఎస్, మేడిగడ్డ పునరుద్ధరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
నేడు అసెంబ్లీకి కేసీఆర్
బుధవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి వచ్చి తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో పాల్గొన్నారు. అనంతరం నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లేదా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి.
బీఆర్‌ఎస్‌కు డిప్యూటీ లీడర్లు
ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో బీఆర్‌ఎస్ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ నియమించారు. తాజాగా ఉభయ సభల్లో బీఆర్‌ఎస్ సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.
శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మండలిలో ఎల్.రమణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేతగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీశ్‌రావు డిప్యూటీ లీడర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమల్లో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్నారు. సభ్యులు మొక్కుబడిగా కాకుండా, సమావేశాలు జరిగే రోజుల్లో ఉదయం 9.30కు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment