సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): రైతులు చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు. టీడీపీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చినుకు రాలక ఎండిన చెరువులు, బోరుబావులతో కరువు పరిస్థితులు దాపురించి సాగు చేసిన పంటలు చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే చేస్తామన్నారు. ఈ నగదును కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము ఇస్తారేమోనని రైతులు ఇప్పటి వరకు ఎదురు చూసినా చంద్రబాబు తీరుతో వారికి నిరాశే మిగిలింది.
జిల్లాలో రైతుల పరిస్థితి...
వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాటమార్చి రుణమాఫీ పరిధిని రూ.1.50 లక్షల వరకు కుదించారు. వీటిని కూడా ఒకే సారి కాకుండా ఐదు విడతలో అందజేస్తామని బీరాలు పలికారు. కానీ చెప్పిన విధంగా తన ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతన్న నడ్డివిరిచారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,56,318 మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ వర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాల్లోని అర్హత పొందిన 3,71,484 మంది ఖాతాలకు మూడు విడతల్లో నగదు జమ చేశారు. పొన్నలూరు మండలంలో రుణమాఫీకి అర్హత పొందిన రైతులు సుమారుగా 9058 మంది ఉన్నారు.
వీరందరికీ వారు తీసుకున్న బ్యాంకు రుణాల అర్హతను బట్టి రూ.44 కోట్లను ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే గత ఐదేళ్లుగా ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.26 కోట్ల రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయినా ఇంకా సుమారుగా రూ.18 కోట్లు మండలంలోని రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నగదును నాలుగు, ఐదు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు మిగిలిన రుణమాఫీ నగదును రైతుల ఖాతాలకు జమచేయలేదు.
అప్పుల ఊబిలో అన్నదాత
మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికినా నేటికీ ఎలాంటి తోడ్పాటు కల్పించలేదు. పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి సాయం ప్రభుత్వం నుంచి సక్రమంగా అందలేదు. దీంతో ప్రభుత్వ సాయంతో పాటు అనుకున్న స్థాయిలో పంటల దిగుబడులు, మద్దతు ధర లేకపోవడం వలన రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అలాగే పండిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.
కనీసం బీమా డబ్బులు వస్తే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను చంద్రబాబు నీరుగార్చారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరిత వాగ్దానాలు, మాయ మాటలు చెబుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వలన నష్టపోయిన పంటలకు రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించినా, ఈ ఐదేళ్ల కాలంలో బీమా చెల్లించకుండా కాలయాపన చేసింది. గ్రామాల్లో రైతులు సాగుచేసి ఎండిపోయిన పంటలను పరిశీలించి సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నివేదికగా తయారుచేసి ప్రభుత్వానికి పంపించనా బీమా ఊసేలేదు.
బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు
చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని తొంగలో తొక్కి పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. ఈ క్రమంలో బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు వందల మంది రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అరకొర నగదును రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసినా, ఆ నగదు రైతులు తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇటువంటి తరుణంలో చెప్పిన మాటలను అమలు చేయని చంద్రబాబు మళ్లీ ఎన్నికలు రావడంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొడుతూ రైతులను మభ్యపెడుతున్నారు.
ఎదురు చూసిన అన్నదాతలు
ఇదిలా ఉంటే నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును గత ఏడాది డిసెంబర్ నెలలో రైతులకు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ ఏడాది వ్యవసాయ పనులు మొదలై నెలలు గడిచినా రైతులను ఆదుకునేలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నించ లేదు. దీంతో వ్యవసాయ పనులకు పెట్టుబడి డబ్బులు లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. రుణమాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమకాకపోవడంతో గత్యంతరం లేక బయట అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు.
వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వలన సాగు చేసిన పంటలు చేతికిరాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇటువంటి తరుణంలో కనీసం రానున్న ఎన్నికల ప్రకటనకు ముందన్నా రుణమాఫీ చేస్తే కొంత మేర ఆదుకుంటుందని ఆశపడిన రైతులకు ప్రభుత్వ తీరు వలన నిరాశ మిగిలింది. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కింద రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి పది శాతం వడ్డీ కలిపితే రూ.34.81 కోట్లు చొప్పున రూ.382.98 కోట్లు అవుతుంది. దీంతో పాటు ఐదో విడత నగదు కూడా రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ నగదు కలిపితే రూ.731.15 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం అందించాల్సి ఉంది.
రైతులను మోసం చేసిన చంద్రబాబు
వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకున్నాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసి అరకొరగా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం జమ చేసిన రుణం వడ్డీలకు కూడా సరిపోలేదు. అవి కూడా మూడు విడతలు మాత్రమే ఇచ్చారు. నాలుగు, ఐదో విడత సొమ్ము ఇంత వరకు ఇవ్వలేదు.
– వరికూటి బ్రహ్మరెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం
పెట్టుబడుల కోసం అప్పులు చేశాం
చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా దగా చేయడం వలన రైతులు పూర్తిగా మోసపోయారు. ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు. కనీసం ప్రభుత్వం నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
– దావులూరి మాల్యాద్రి, రైతు, విప్పగుంట
ప్రభుత్వం ఆదుకోలేదు
నేను 15 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పంట ఎండిపోయింది. సుమారుగా ఒక లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. అంతేకాకుండా పంటకు బీమా కూడా చేశాను. ఇంత వరకు బీమా అందలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులను ఏ విషయంలో ఆదుకోలేదు.
– శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం
Comments
Please login to add a commentAdd a comment