రుణమాఫీపై కాంగ్రెస్ మోసం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment