మండిపడుతున్న రైతులు
రేషన్‌కార్డు ప్రామాణికంతో లక్షల మందికి మాఫీ వర్తించదనే ఆందోళన
పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే మరికొన్ని లక్షల మంది రైతులకు నష్టం
మార్గదర్శకాల్లో కొర్రీలు పెట్టడమేమిటంటూ మండిపడుతున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలుకోసం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడిలా కొర్రీలు పెట్టడం ఏమిటని.. ఇలాగైతే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందకుండా పోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆచరణలోకి వచ్చేసరికి ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కొర్రీలు పెడుతోందని మండిపడుతున్నారు.
చాలా మందికి రేషన్‌కార్డులు లేవంటూ..
ప్రధానంగా రేషన్‌కార్డు ద్వారానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొనడంపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లక్షలాది మంది రైతులకు రేషన్‌కార్డులు లేవని.. వేర్వేరు కుటుంబాలుగా విడిపోయి పంట రుణాలు తీసుకున్న వారికి విడిగా రేషన్‌కార్డులు రాలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. రేషన్‌కార్డు లేనివారికి రుణమాఫీ వర్తించకపోవడం, పాత రేషన్‌కార్డుల్లో ఒకే కుటుంబంగా ఉన్నవారందరికీ కలిపి రూ.2లక్షలలోపే రుణమాఫీ చేయడం వల్ల లక్షల మందికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు.
ఆధార్ లింకేజీ సమస్యతోనూ..
బ్యాంకు రుణఖాతా, పాస్‌బుక్ డేటా, రేషన్‌కార్డు డేటాలను లింక్ చేసి.. ఆధార్ ఒకటిగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవన్నీ సరిగా లేని, ఆధార్ లింక్ కాని రైతులు లక్షల మంది ఉన్నారని.. వారికి రుణమాఫీ వర్తించకపోతే ఎలాగనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అలాగే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మరి వీరి పరిస్థితి ఏమిటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
పీఎం కిసాన్ నిబంధనలతో కష్టమే!
ఇక పీఎం కిసాన్ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకుంటే.. మరికొన్ని లక్షల మంది రుణమాఫీకి అర్హత కోల్పోతారని రైతులు అంటున్నారు. పీఎం కిసాన్ పథకంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆదాయపన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇందులో ఆదాయ పన్ను చెల్లించేవారిలో అనేక మంది ప్రైవేటు ఉద్యోగులు, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారు గ్రామాల్లో తీసుకున్న పంట రుణాలు కూడా మాఫీ కాని పరిస్థితి ఉంటుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
ఆర్థిక భారం తగ్గించుకునే దుష్ట ప్రయత్నం
రుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన కొర్రీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దుష్ట ప్రయత్నం. రేషన్‌కార్డులు, పాస్ పుస్తకాలు లేని రైతులు లక్షల్లో ఉన్నారు. ధరణి సమస్యల వల్ల 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు రాలేదు. పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం సరికాదు. రుణాలు రెండు లక్షలకుపైగా ఉంటే.. ఆ అదనపు మొత్తాన్ని రైతులు చెల్లించాకే రుణమాఫీ చేస్తామనడం తప్పు. రీషెడ్యూల్ చేసిన రుణాలను మినహాయించడం సరికాదు. కటాఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలి. కౌలుదారులకు, జేఎల్‌జే, ఎస్ హెచ్‌జీ గ్రూపులకు రుణమాఫీ వర్తింప చేయ కపోవడంతో వారికి నష్టం జరుగుతుంది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకులు
పీఎం కిసాన్ నిబంధనలతో పెరగనున్న రుణమాఫీ అనర్హులు
పీఎం కిసాన్ డేటాకు జోడించడం వలన చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతారు. రేషన్‌కార్డులను బట్టి కుటుంబాన్ని నిర్ణయించడం వల్ల లక్షల మందికి నష్టం జరుగుతుంది. కరువులు, వరదల వల్ల నష్టపోయిన రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకుంటే వారికి రుణమాఫీ వర్తించని పరిస్థితి. రెండు లక్షలకు మించి రుణం ఉంటే.. ఆపైన ఉన్న మేర అప్పు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందనే కూడా దారుణం. ప్రభుత్వం వెంటనే ఈ మార్గదర్శకాలను సవరించాలి. – పోతినేని సుదర్శన్‌రావు, తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
రైతుల్లో అసంతృప్తి రగులుతుంది
రుణమాఫీ అమలుకు కొత్తగా షరతులు, నిబంధనలు విధించడం భావ్యం కాదు. రేషన్‌కార్డులతో ముడిపెట్టడం, స్వల్పకాలిక పంట రుణాలకే ఇస్తామనడం వంటివి పొరపాటు. దీనివల్ల రుణమాఫీ కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి పెరుగుతుండగా.. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి రగిలే అవకాశాలు ఉన్నాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment