రుణమాఫీపై నేడు నిర్ణయం | Decision on loan waiver may 18th: Telangana | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై నేడు నిర్ణయం

May 18 2024 5:26 AM | Updated on May 18 2024 5:26 AM

Decision on loan waiver may 18th: Telangana

మంత్రివర్గ భేటీలోచర్చించే అవకాశం

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై కూలంకషంగా చర్చ

కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులపై కీలక నిర్ణయం తీసుకునే చాన్స్‌ 

విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలపైనా దృష్టి పెట్టనున్న కేబినెట్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్‌ సచివాలయంలో జరగనుంది. లోక్‌ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్‌ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల  మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోళ్లపై చర్చ
ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.

ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement