కాలమైతే మీ ఖాతాలో... కరువొస్తే పక్కవారి ఖాతాలో వేసే నైజం మీది
మాజీ మంత్రి హరీశ్‌కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు.
రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్‌ఎస్ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్‌ఎస్ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment