సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన బహుమతి. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటు అయింది’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రతి విషయంలో టీఆర్‌ఎస్ నేతలు బూటకపు మాటలు చెబుతూ వస్తున్నారు. నిన్న నల్గొండలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ ఏడాది రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ జరగలేదు. రుణామఫీపై ప్రశ్నిస్తే జగదీష్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రుణంలేని వాళ్లకు కూడా ఎకరానికి ఇంత అని కూడా ఇచ్చింది. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. 1.82లక్ష కోట్ల బడ్జెట్‌లో రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయదో ప్రభుత్వం చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన గంటలోపే రూ.11వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. (నువ్వెంత.. నువ్వెంత?)
2018 ఎన్నికల్లో గెలుపు కోసమే ఆనాడు 90శాతం రుణమాఫీ చేశారు. ఎన్నికల తర్వాత ఎప్పుడూ రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. నల్గొండ డివిజన్‌లో రైతు రుణబంధు కింద రూ.62 కోట్లు అయితే 35 కోట్లు మాత్రమే అయింది. ఇక రబీ సీజన్‌లో ఒక్క డివిజన్‌లోనే 75 కోట్లు కావాలంటే 50కోట్లు మాత్రమే ఇచ్చారు. ధాన్యం 1కోటి 4లక్షల మెట్రిక్ టన్నులకు 50లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. 30వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 10వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. గత ఏడాది నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పెడితే రైతులు అమ్మడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పెట్టాలని సీఎం అంటున్నారు. పత్తి కొనుగోళ్లు విషయంపై ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ, ప్రణాళిక ఇవ్వాలి. ఛత్తీస్‌గఢ్ రైతులు తెలంగాణకి వచ్చి పంట అమ్ముకుంటున్నారనేది పచ్చి అబద్ధం. (కాంగ్రెస్లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!)
రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సన్న రకాల ధాన్యం పండించాలని అంటుంది కానీ రైతులకు హామీ ఇవ్వడం లేదు. మూడు నెలల క్రితం ప్రభుత్వం కొన్న కందుల రైతులకు నిధులు ఇవ్వలేదు. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. పసుపు రైతుల విషయంలోనూ సీఎం కేసీఆర్ మాట తప్పారు. నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్యలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి జగదీష్ రెడ్డే కారణం. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇరిగేషన్ అభివృద్ధి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 75లక్షల ఎకరాల ఇరిగేషన్ ఆయకట్టు ఉంది. 2009లో నాపై పోటీ చేసి ఓడిపోయిన బాధ ఇంకా జగదీష్ రెడ్డి మర్చిపోనట్లు ఉన్నారు. నేను కూడా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. జగదీష్ రెడ్డి నిన్నమంత్రి హోదాను మరిచి వ్యవహరించారు. రుణమాఫీ చేయలేదు అని నేను ప్రశ్నించాను. మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాము’ అని అన్నారు. (ప్రభుత్వానికి సోయి వస్తలేదు)
Comments
Please login to add a commentAdd a comment