సాక్షి, అమరావతి: ఏవేవో హామీలతో ప్రజలను బుట్టలో వేసుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలను వంచించడంలో సిద్ధహస్తుడుగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి దొంగ హామీలతో మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థి కంగా పైకి తీసుకొస్తా, టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తా, ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చేస్తా అంటూ ఇప్పటికే రకరకాల మాయ మాటలు చెబుతున్న ఆయన.. మరోసారి ఎన్నికల మేనిఫెస్టో పేరుతో వంచనకు సిద్ధమవుతున్నారు.
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో తయారు చేసే పేరుతో గ్రామ స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ అనే డ్రామాకు తెరలేపారు. యువకులు, మహిళలు, నిరుద్యోగుల వంటి వర్గాలను బుట్టలో వేసుకోవాలంటే ఏమేమి హామీలు ఇవ్వాలంటూ మండల, జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలను మాయ చేసే మేనిఫెస్టో కోసం ప్రత్యేకంగా వ్యూహకర్తల బృందాన్ని కూడా నియమించి, వారితో అధ్యయనాలు చేయిస్తున్నారు.
వీటిన్నింటినీ క్రోడీకరించి, ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో ట్రైలర్ (శాంపిల్) మేనిఫెస్టోను విడుదల చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మరిన్ని వంచనలతో పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపొందించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
నమ్మకానికి, చంద్రబాబుకు అస్సలే పడదు
ఈ ఎన్నికల మేనిఫెస్టోపై చంద్రబాబు చాలా రోజుల నుంచే పనిచేస్తున్నారు. మేనిఫెస్టో, అందులో హామీలు ఎలా ఉంటే ప్రజలు తనను నమ్మడానికి అవకాశం ఉంటుందో అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే.. నమ్మకానికి, చంద్రబాబుకు అస్సలు పడదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా ఒక మాట చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో పేరుండగా.. చంద్రబాబుపై మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం ఉంది.
చంద్రబాబు ఏ మాట చెప్పినా అది రాజకీయం కోసమే తప్ప ఆచరణలోకి తీసుకురారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజల్ని వంచించిన చరిత్ర ఆయనది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ వంటి అనేక హామీలే ఇందుకు ప్రబల నిదర్శనం. రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత దానికి సవాలక్ష కొర్రీలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టారు.
అదే విధంగా డ్రాక్రా మహిళలనూ వంచించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను నమ్మించి, ఎన్నికల ఏడాది వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా దాన్ని తూతూమంత్రంగా అమలు చేసి నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. ఇంటికో ఉద్యోగం, బాబొస్తేనే జాబు వంటి ఎన్నో హామీలు బుట్టదాఖలయ్యాయి. 2014 ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు 600కి పైగా హామీలతో చంద్రబాబు ఒక పుస్తకాన్నే విడుదల చేశారు.
అందులో పది శాతం కూడా అమలు చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రజలు వాటి గురించి అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక చేతులెత్తేసి తోకముడిచేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చీదరించుకుని చిత్తుగా ఓడించారు.
ప్రజలను ఎలాగైనా నమ్మించడమే లక్ష్యం
గత ఎన్నికల్లో తనని తిరస్కరించిన ప్రజలను ఎలాగైనా నమ్మించడానికి చంద్రబాబు మాయోపాయం పన్నుతున్నారు. ప్రజలను ఏమార్చే హామీలపై అధ్యయన బృందాలు, వ్యూహకర్తలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మహానాడులో శాంపిల్ మేనిఫెస్టోను ప్రజల్లోకి వదిలేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ఆయన ఇప్పటికే ప్రజలకు నమ్మబలుకుతున్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థపైనా నర్మగర్భంగా ప్రకటనలు చేస్తూ దాన్ని కొనసాగిస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పలు ప్రకటనల ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ముమ్మరం చేసే క్రమంలోనే మేనిఫెస్టో రాజకీయానికి తెరలేపారు. చంద్రబాబు మాయ మాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్ముతారా అనే ప్రశ్నకు టీడీపీ నాయకులే నీళ్లు నములుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment