ఏమన్నా చెప్పండి.. మేనిఫెస్టోలో పెట్టేద్దాం | Sakshi
Sakshi News home page

ఏమన్నా చెప్పండి.. మేనిఫెస్టోలో పెట్టేద్దాం

Published Mon, Apr 29 2024 5:25 AM

Chandrababu struggles to lure people with fraudulent promises

మోసపు హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు పాట్లు

సాక్షి, అమరావతి: మాయ మాటలతో ప్రజలను వంచించడంలో తనకు తానే సాటైన చంద్రబాబు ఇంకా అదే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్ని­కల్లో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు అమలు­కాని అనేక హామీలను నోటికొచ్చినట్లు ఇచ్చేస్తున్న ఆయన ఇంకా అలాంటిమేమైనా ఉన్నాయా అని తెగ అన్వేషిస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే విష­యాలు ఏమైనా ఉంటే చెప్పాలని పార్టీ నాయకులు, తన మద్దతుదారులను కోరుతున్నారు. ఎవరైనా అలాంటివి చెబితే వాటిని కూడా మేనిఫెస్టోలో పెట్టేయడానికి తంటాలు పడుతున్నారు. 

2014లో ఇలాగే 600కి పైగా హామీలను ఎడాపెడా ఇచ్చేసి ప్రజలను మాయచేసి ఆ తర్వాత వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చివరికి మేనిఫెస్టోనే మాయం చేశారు. ఈ ఎన్నికల్లోనూ సూపర్‌ సిక్స్‌ అంటూ ఇప్పటికే మళ్లీ కొత్త హామీలిచ్చేశారు. ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో వాటిని ప్రజల్లోకి వదిలారు. ముందస్తు మేనిఫెస్టో పేరుతో ఆరునెలల క్రితమే దాన్ని విడుదల చేశారు.

మరో­వైపు.. సీఎం వైఎస్‌ జగన్‌ అమలుచేస్తున్న అమ్మ­ఒడి, రైతుభరోసా వంటి పథకాల పేర్లు మార్చి వాటిని అమలుచేస్తానని అందులో పేర్కొ­న్నారు. అలాగే, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలను కూడా కాపీకొట్టి అందులో పెట్టారు. అయితే, బాబు మాయా చరిత్రే­మిటో తెలిసిన ప్రజలు దానికి కనీసం స్పందించలేదు. జనం తాను చెబితే నమ్మడంలేదని జనసేన అధ్య­క్షుడు పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఉమ్మడి మేని­ఫెస్టోకు రూపకల్పన చేస్తున్నట్లు కొద్ది­రోజు­లుగా చెబుతు­న్నారు. 

తాజాగా.. బీజేపీని కూడా కలుపు­కుని మూడు పార్టీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయ­డానికి కసరత్తు చేస్తున్నారు. కానీ, 2014 ఎన్నిక­ల్లోనూ ఇదే కూటమి పేరుతో ప్రధాని మోదీ, పవన్‌ తన ఫొటో కలిపి, తాను సంతకం చేసి మరీ చంద్ర­బాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అధికా­రంలోకి వచ్చాక దాన్ని చెత్తబుట్టలో పడే­య­డంతో ప్రజలు కూడా 2019లో ఆయన్ని చెత్తలోకి నెట్టే­శారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో ప్రజ­లను వంచించేందుకు నానాపాట్లు పడుతున్నారు.

‘సూపర్‌ సిక్స్‌’తో సంబంధంలేకుండా ఎడాపెడా హామీలు..
ఈ క్రమంలోనే తన ‘సూపర్‌ సిక్స్‌’తో సంబంధం లేకుండా చంద్రబాబు మరికొన్ని హామీలను ఎన్నికల సభల్లో ఎడాపెడా ఇచ్చిపారేశారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని, దీనికి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని ఊదర­గొడు­తు­న్నా­రు. యువతను ఆకర్షించే లక్ష్యంతో వారికి ఉద్యోగా­­ల ఆశ కల్పించేందుకు శతవిధాలా ప్రయ­త్ని­­స్తు­న్నారు. 

2014లోనూ ఇలాగే రైతు రుణాలను బేషరతుగా మాఫీచేస్తానని, తొలి సంతకం దానిపైనే చేస్తానని నమ్మబలికారు. కానీ, రుణమాఫీ చేయ­కుండా తూతూమంత్రంగా ఏదో చేశామంటే చేశా­మ­నిపించడంతో చంద్రబాబు మాట­లు నమ్మి పంట రుణాలు కట్టని రైతులను బ్యాంకులు ముప్ప­తిప్ప­లు పెట్టాయి. వారి రుణాలు పెరిగిపోయి అష్ట­కష్టాలు పడ్డారు. 

అలాగే, బెల్టు షాపులు రద్దుచే­స్తా­మని చెప్పి తొలి సంతకం చేసినట్లు చెప్పి­నా ఆ పని చేయ­క­పోయినా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులను ఇంకా పెంచేశారు. ఇలా ఇచ్చిన ప్రతి హామీని బుట్ట­దాఖలు చేసిన బాబు మేనిఫెస్టో అమలులో సూపర్‌ ట్రాక్‌ రికార్డు ఉన్న వైఎస్సార్‌సీపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తుండడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీని కాపీ కొట్టేందుకే బాబు మేనిఫెస్టో ఆలస్యం..
99 శాతం హామీలు అమలుచేసి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయాలని కోరుతున్న వైఎస్‌ జగన్‌ను ఒక్క హామీ కూడా అమలు­చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రశ్ని­స్తుండడాన్ని ప్రజలు వింతగా చూస్తు­న్నారు. ఇప్పటికే ముందస్తు మేనిఫెస్టో విడు­దల చేసి ఆ తర్వాత కూడా ఎడాపెడా హామీలిచ్చిన చంద్ర­బాబు తుది మేనిఫెస్టోను ఒకట్రెండు రోజు­ల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

నిజానికి ఇది ఎప్పుడో విడుదల చేయాల్సి వున్నా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కోసం ఎదురు­చూశారు. తన మేనిఫెస్టోలో లేని అంశాలు అందులో ఏమైనా ఉంటే వాటిని కాపీ కొట్టే ఉద్దేశంతో ఆలస్యం చేశారు. గత ఎన్నికల్లో రూ.3 వేల పెన్షన్‌ హామీని అలాగే కాపీకొట్టి చివరి రెండు నెలలు ఇచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. 

ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉండడం విశేషం. తాజాగా.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలవడంతో తాను కూడా మేనిఫెస్టో ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈలోపు ఇంకేమైనా ఉంటే చెప్పాలని వాటిని మేనిఫెస్టోలో పెట్టేస్తానని చెబుతుండడంపై సాధారణ జనం నవ్వుకుంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement