మాఫీకి మార్గం చూడండి | Revanth Reddy Review with Ministers on loan waiver and grain procurement | Sakshi
Sakshi News home page

మాఫీకి మార్గం చూడండి

Published Thu, May 16 2024 4:39 AM | Last Updated on Thu, May 16 2024 4:39 AM

Revanth Reddy Review with Ministers on loan waiver and grain procurement

ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే... ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అధికారులతో చర్చ

విధివిధానాలతో కూడిన ప్రణాళికల రూపకల్పనకు ఆదేశం

భారీగా నిధులిచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచన

అవసరమైతే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సరిపడా రుణాలు సమీకరించాలని స్పష్టీకరణ

రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై మంత్రులతో కలిసి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను  అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. 

రూ.2 లక్షల వరకు రుణమాఫీకి  సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,  శ్రీధర్‌బాబు, తన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి
‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్,  ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్‌ ఆదేశించారు. 

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్‌ చేసి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్‌ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement