రుణ మాఫీపై ఉద్యమించిన రైతులు | Farmers protest on Loan waiver | Sakshi
Sakshi News home page

రుణ మాఫీపై ఉద్యమించిన రైతులు

Feb 14 2019 4:52 AM | Updated on Feb 14 2019 4:52 AM

Farmers protest on Loan waiver - Sakshi

ధర్నా చేస్తున్న రైతు సంఘ నాయకులు

సాక్షి, అమరావతి: రైతుల రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో దగా చేస్తోందని రైతులు మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలొస్తున్నా హామీ నిలబెట్టుకోలేకపోగా ఇప్పుడు చివరి రెండు విడతలను చెక్కులుగా ఇస్తామనడం దారుణమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు వద్దు, నగదు జమ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం గన్నవరంలోని రైతు సాధికార సంస్థ ఎదుట రైతు సంఘాలు పెద్దఎత్తున ధర్నా చేశాయి. నగదును ఒకేసారి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సీపీఐ, సీపీఎం అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. నల్లబాడ్జీలు ధరించిన రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ పూర్తి చేయకపోవడాన్ని రైతులు నిరసించారు.

ఇంకెంత కాలం సాగదీస్తారన్న నినాదాలతో రైతు సాధికార సంస్థ దద్దరిల్లింది. మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చెక్కులతో రైతుల్ని మోసం చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాను ఉద్దేశించి రైతు సంఘాల నేతలు పలువురు ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.87,612 కోట్లు మాఫీ కావాల్సి ఉంటే దాన్ని రూ.24,500లకు కుదించారని, ఆ మొత్తాన్ని కూడా ఇంతవరకు ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందుల పాల్జేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది బ్యాంకుల ఎదుట డిఫాల్డర్లుగా మారారని మండిపడ్డారు. మూడో విడత డబ్బులు అందక రైతులు ఇప్పటికీ ఇక్కట్లు పడుతూ రైతు సాధికార సంస్థ చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాల్గోవ విడత మంజూరైన రూ.4,100 కోట్లు ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. ఈ ఆర్ధిక ఏడాది బడ్జెట్‌ ముగిసినప్పటికి నాలుగు, ఐదు విడతల రుణమాఫీ మొత్తం రూ.9,100 కోట్లు చెల్లించకపోవడం దారుణమన్నారు.

రెండు విడతల మొత్తాన్ని ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు రైతు సాధికార సంస్థ ఓఎస్‌డీ సురేంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రతిరోజు వందల మంది గన్నవరం చుట్టూ తిరుగుతున్నందున రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలోని వ్యవసాయ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్, యల్లమందరావు, వెలగపూడి అజాద్, జి.రమేష్, వై.కేశవరావు, పి.పెద్దిరెడ్డి, సీతారావమ్మ, పెద్ది వెంకటరత్నం, సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు.

వేర్వేరుగానే చెక్కులు..
దీనిపై రైతు సాధికార సంస్థ ఓఎస్‌డీ సురేంద్రబాబు స్పందిస్తూ 4, 5 విడతల రుణమాఫీ చెక్కులను వేర్వేరుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మార్చి 31లోగా చెల్లించేందుకు నిధులు సమీకరిస్తున్నామని, బ్యాంకుల వద్ద అవమానాల పాలుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బాధ్యులను నియమించామని, వారి పేర్లను, ఫోన్‌ నెంబర్లను మీడియాకు కూడా అందజేస్తామన్నారు. గతంలో ఇచ్చిన బాండ్లతో ఇక సంబంధం ఉండదని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని బ్యాంకుల్లో వేసుకుని నగదు చేసుకోవచ్చని వివరించారు. అయితే దీనిపై రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వం రైతులకు పోస్ట్‌డెటేడ్‌ చెక్కులు ఇవ్వడం సరికాదన్నారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే చెక్కులు చెల్లుబాటయ్యే పరిస్ధితి లేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు బకాయిలు నోటిఫికేషన్‌ ముందే చెల్లించాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement