హామీలతో ఏమార్చారు | Babu cheated with the promises | Sakshi
Sakshi News home page

హామీలతో ఏమార్చారు

Published Tue, Nov 1 2016 4:31 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

చంద్రబాబు సర్కారు రెండున్నరేళ్ల పాలనలో జిల్లాకిచ్చిన హామీల అమలు ప్రశ్నార్థకంగా మారింది.

- హామీలు మరచిన చంద్రబాబు సర్కారు
- పరిశ్రమల్లేవు.. ఉద్యోగాల ఊసులేదు
- ఇప్పట్లో వెలిగొండ పూర్తయ్యే పరిస్థితీ లేదు
- చేనేత కార్మికులకు రుణమాఫీ లేదు
నష్టపోరుున రైతులకు చేయూత కరువు
- ప్రజల్ని మాటలతో మభ్యపెడుతున్న పాలకులు
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు సర్కారు రెండున్నరేళ్ల పాలనలో జిల్లాకిచ్చిన హామీల అమలు ప్రశ్నార్థకంగా మారింది. కోట్లాది రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం... లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు.

 నేటికీ ఒక్క పరిశ్రమ ర్పాటు కాలేదు. ఒక్క ఉద్యోగం రాలేదు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో వేగం లేదు. రాబోయే రెండున్నరేళ్లలో  నీళ్లొచ్చే పరిస్థితి లేదు. సోమశిల నుంచి రాళ్ళపాడుకు ఉత్తర కాలువ తవ్వేస్తున్నామన్నారు. దాని ఊసే లేదు. నాలుగేళ్లుగా జిల్లాకు ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. దాదాపు 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు. నకిలీ మిరప విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోరుునా స్పందించలేదు. 143 జీవోను తెరపైకి తెచ్చి, సుబాబుల్, జామాయిల్ రైతులను వంచించారు. అసలు నీళ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టు లేకుండా పరిశ్రమలు నెలకొలే పరిస్థితి లేదని పారిశ్రామిక వేత్తలు తేల్చి చెబుతున్నా..  కనిగిరిలో నిమ్జ్.. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమల వెల్లువ అంటూ పాలకులు మాత్రం ప్రకటనలిస్తూనే ఉన్నారు. ప్రజల్ని ఏమార్చుతూనే ఉన్నారు. మాటలతో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన అమలుకాని హామీలపై అవలోకన ం..జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సర్కారు వందలాది హామీలను గుప్పించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు.  

 ఒంగోలు : ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామన్ అన్నారు. వీటి ఊసే లేదు. వెటర్నరీ యూనివర్సిటీ ఇస్తామని చెప్పినా అది నెరవేరలేదు. మైనింగ్ యూనివర్సిటీ హామీ నీటి మూటగా మారింది.  
 దర్శి : దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటించిన ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తాళ్ళూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పారు. తాళ్ళూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇస్తామన్నారు. ఇంత వరకు అతీగతి లేదు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ ఇస్తామని చెప్పారు.  తాళ్ళూరు, ముండ్లమూరు ప్రాంతంలో సాగర్ కాలువల ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పినా అదీ నెరవేరలేదు.

 అద్దంకి : అద్దంకిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఆ హామీని నెరవేర్చలేదు. మేదరమెట్ల, అద్దంకి రహదారుల్లో 210 కి.మీ. రోడ్డు పరిధిలో చాలా చోట్ల రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తామని చెప్పిన అవి నెరవేరలేదు. భవనాశి రిజర్వాయర్ అభివృద్ధి పనులు బల్లికురవ మండలంలో పెండింగ్‌లో ఉన్నాయి. యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదు.  

 చీరాల : చీరాలలో 25 వేల చేనేత మగ్గాల పరిధిలో 50 వేల మందికిపైగా చేనేత కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. చేనేత రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.50 కోట్ల మేర రుణాలు చెల్లించలేక చేనేతలు లబోదిబోమంటున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు పైసా మాఫీ చేయలేదు.

 యర్రగొండపాలెం : వెలిగొండ పనులు పూర్తయితే నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలకు తాగు, సాగు నీరు అందుతుంది. కానీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
 గిద్దలూరు : గిద్దలూరు పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ.350 కోట్లతో పనులు పూర్తి చేసి నీళ్ళిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చింది. ఇంత వరకు దాని ఊసే లేదు. నల్లమల్ల అడవుల్లోని బైరేనిగుండాలు ద్వారా గిద్దలూరు పరిధిలోని 14 గ్రామాలకు నీళ్లిస్తామని చెప్పిన అది నెరవేరలేదు. ముండ్లమూరు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిద్దలూరుకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. అటవీ అనుమతుల్లేక బేస్తవారిపేట మండలం కోనపల్లి టు ఉదయగిరి, రాచర్ల మండలం ఆరవేటికోట టు అర్థవీడు మండలం పాపినేనిపల్లి వరకు రోడ్డు పనులు నిలిచిపోయాయి.
 కందుకూరు : సోమశిల ఉత్తర కాలువ రాళ్ళపాడు ప్రాజెక్టు వరకు తవ్వాల్సి ఉంది. తద్వారా ప్రాజెక్టు రాళ్ళపాడుకు నీళ్ళిస్తామన్నారు. నీళ్ళిస్తామన్న బాబు సర్కారు దాన్ని పట్టించుకోలేదు. ఇక రామాయపట్నం పోర్టు, రాళ్ళపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అవి అమలుకు నోచుకోలేదు.
 కనిగిరి : కనిగిరి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వాడ (నిమ్జ్)ను 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆ పనులు ముందుకు సాగడం లేదు. ఇక అదే ప్రాంతంలో సోలార్ హబ్ అని ప్రకటించిన ఆ పనులు జరగడం లేదు.
 కొండపి : కొండపలోని సంగమేశ్వరం ప్రాజెక్టును రూ.50.50 కోట్లతో పూర్తి చేసి తద్వారా 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. దీంతో పాటు కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు ప్రాంతాల్లో 50 గ్రామాలకు నీరందిస్తామన్నారు. టంగుటూరు నుంచి కొండపి, జరుగుమల్లి టు టంగుటూరు రింగ్‌రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. పొన్నలూరు మండలం ముక్కరాజుపాలెం టు కనిగిరిలో అలవలపాడు గ్రామం రూ.14 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మిస్తామని చెప్పిన ఆ హామీ నెరవేరలేదు.
 మార్కాపురం : నియోజకవర్గ పరిధిలో వెలిగొండ పూర్తి చేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. పొదిలిలో ఫైర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
 పర్చూరు : శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు సాగర్ కాలువ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పిన అవి ముందుకు సాగడం లేదు. నియోజకవర్గంలో కౌలు రైతులకు రుణమాఫీ చేయలేదు.
 సంతనూతలపాడు : నియోజకవర్గంలో పేదలందరికీ పక్కా గృహాలు అందిస్తామన్నారు. కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement