
రుణమాఫీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ జరగలేదు
ఇలాంటి రైతులు ఆందోళనలో ఉంటే సంబురాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతులను ఏడు నెలలుగా ఊరించి, చివరకు కంటతడి పెట్టించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ‘చారాణ కోడికి.. బారాణా మసాలా’అనే సామెతను తలపించేలా రుణమాఫీపై ప్రభుత్వం తీరు ఉందన్నారు. అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని అన్నారు. రుణమాఫీ జరగని అర్హులైన రైతులు ఓ వైపు ఆందోళనలో ఉంటే, సంబురాలు ఎందుకని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.
40 లక్షల మంది లబ్ధిదారుల్లో 30 లక్షల మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వ్యవసాయ సీజన్లు కావస్తున్నా రైతు భరోసాను ప్రారంభించలేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందన్నారు. ఇంతకాలం ప్రజల దృష్టిని మళ్లించిన రేవంత్ ప్రభుత్వం, ప్రస్తుతం నిధుల దారిమళ్లింపునకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
పేదరిక నిర్మూలనలో రెండో స్థానం
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.
2020–21తో పోలిస్తే 2023–24 (ఎస్‌డీజీ)లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020 –21తో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందన్నా రు. చాలారంగాల్లో తెలంగాణ సాధించిన మా ర్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి.. రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment